ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 06:26:32

త్వరలో‘టీఎస్‌ ఆర్టీసీ కార్గో’ సర్వీసులు

త్వరలో‘టీఎస్‌ ఆర్టీసీ కార్గో’ సర్వీసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ ఆర్టీసీ) ఆధ్వర్యంలో వస్తున్న ఆర్టీసీ కార్గో సేవలు మార్చి నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని హైదరాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఆర్టీసీని ఎలాగైనా లాభాల్లోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో రవాణేతర ఆదాయంపై దృష్టిసారించిన టీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీసులను అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. కండీషన్‌ లేని కాలపరిమితి ముగిసిన దాదాపు 680 బస్సులను కార్గో సర్వీసులతోపాటు మొబైల్‌ టాయిలెట్స్‌గా మార్చేందుకు నిర్ణయించింది. 

మొదటి విడుతలో కేవలం 100 కార్గో సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతానికి 73 కార్గో సర్వీసులు సిద్ధం కాగా, మిగతా సర్వీసులను సిద్ధం చేసే పనిలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ప్రయాణ సేవలతో రెవెన్యూ సాధిస్తున్న ఆర్టీసీ, కార్గో సర్వీసుల ద్వారా వస్తు రవాణా చేసి లాభార్జన సాధించాలని నిర్ణయించింది. వీటిని ఎర్రటి రంగులో డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు(డీజీటీ) సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు. మొదటి విడుతగా 100 బస్సులను తయారు చేస్తున్నారు. 

ఒక్కో డిపోకు అనుసంధానంగా రెండు డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను అందుబాటులో తెస్తున్నారు. వీటి ద్వారా డిపో సమీపంలోని ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు వస్తు రవాణా సేవలు అందిస్తున్నారు. నగరంలోని 29 డిపోల్లో సుమారు 60 డీజీటీలను అందుబాటులోకి తెస్తున్నారు. మిగతా వాటిని జిల్లాల్లోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. 

మొదటి దశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు. అనంతరం వాటిని ప్రభుత్వశాఖలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి వస్తు రవాణాను టీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా జరిపేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో మొదటగా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ రవాణాపై దృష్టి సారించనున్నారు. పీడీఎస్‌ బియ్యం, పంటలు తదితర సేవలను ఆర్టీసీ కార్గో ద్వారా నిర్దేశిత ప్రదేశాలకు తరలించనున్నారు. విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సర్వీసులను ఏర్పాటు చేయడంలో టీఎస్‌ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ కీలకపాత్ర పోషిస్తున్నది.


logo