గురువారం 09 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 00:57:11

ఆరేండ్లలో ఉద్యోగాల జాతర!

ఆరేండ్లలో ఉద్యోగాల జాతర!

  • పారదర్శకంగా భర్తీ ప్రక్రియ..  టీఎస్‌పీఎస్సీ ద్వారా 36వేల ఉద్యోగాలు
  • పోలీసు శాఖలో 40,914మందికి ఉపాధి.. విద్యుత్‌ సంస్థల ద్వారా మరో 7600కుపైగా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగ నియామకం సంగతి అటుంచి నోటిఫికేషన్లు కూడా కనిపించేవి కావు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. 

టీఎస్‌పీస్సీ రికార్డు బ్రేక్‌

 2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాలంలో నాటి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 24,086. ఇందులో తెలంగాణ నుంచి ఆరువేలమంది కూడా ఎంపిక కాలేదు. తెలంగాణ ప్రభుత్వం  టీఎస్‌పీఎస్సీని ఏర్పాటుచేసిన నాటినుంచి ఇప్పటివరకు 104 ఉద్యోగ నోటిఫికేషన్లు, 36 శాఖాపరమైన నోటిఫికేషన్ల జారీ అయ్యాయి. మొత్తం 36,643 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాగా, 29,091 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. మరో 1,636 పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 

పోలీసుశాఖలో 40,914 ఉద్యోగాలు

ప్రభుత్వం పోలీసుశాఖను బలోపేతం చేయడంలో భాగంగా పెద్దమొత్తంలో నియామకాలు చేపట్టింది. మొత్తంగా 40,914 మందిని భర్తీ చేసింది. 2014 జూన్‌లో పోలీసుశాఖలో 8,447 పోలీసుకానిస్టేబుల్స్‌ నియామకాలు జరిగాయి. అనంతరం 2017లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పోలీసుశాఖలో 18,290 పోస్టులను మంజూరుచేసింది. సివిల్‌లో 9,629 పోస్టులు, ఏఆర్‌ 5,538, టీఎస్‌ఎస్పీలో 2,075 పోస్టులు, కమ్యూనికేషన్స్‌లో 143 పోస్టులు, మినిస్టీరియల్‌లో 599 పోస్టులు భర్తీ చేసింది.  

విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాలు

విద్యుత్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాయి. ఇందులో భాగంగా 22,500కు పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. టీఎస్‌జెన్కో, టీఎస్‌ట్రాన్స్‌కో తమ పరిధిలో మొత్తం 7,659 పోస్టుల భర్తీని చేపట్టింది. 

సింగరేణిలో 12,500 పోస్టులు

సింగరేణి బొగ్గు గనుల సంస్థలో కొత్తగా 12,500 కొలువులను భర్తీచేసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో మైనింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, పర్సనల్‌, అకౌంట్స్‌, తదితర విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. తెలంగాణ రెసిడెన్షియల్స్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా గురుకులాల్లో 3,500 పోస్టుల భర్తీ జరిగింది. 


logo