బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 08, 2020 , 02:47:16

చర్మపద కోశం గొప్ప కృషి

చర్మపద కోశం గొప్ప కృషి
  • ఆరువేల పదాలు చేర్చటం గొప్పవిషయం
  • నిఘంటువును ఆవిష్కరించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ చక్రపాణి

హిమాయత్‌నగర్‌: నాగరికత వికాసం, భాషాభివృద్ధికి సంబంధించి చర్మపద కోశం కీలకమవుతుందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన చర్మపదకోశం (తోలు సంబంధ పదాల నిఘంటువు)ను శుక్రవారం హిమాయత్‌నగర్‌లో కవి, రచయిత జూలూరు గౌరీశంకర్‌తోకలిసి ఆయన ఆవిష్కరించారు. తోలుకు సంబంధించిన ఆరువేల పదాలను ఒకచోట చేర్చడం గొప్పవిషయమన్నారు. కనుమరుగవుతున్న తోలు సంబంధిత పదజాలాన్ని రచయిత ఆర్‌ఎల్‌ ప్రసాద్‌ నిఘంటువు రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. 


ప్రాచీనకాలం నుంచి ఆధునిక కాలం వరకు ప్రజలకు తోలు నిరంతరం ఉపయోగపడుతున్నదని చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మూలాలు మరిచిపోతున్న ప్రజలకు తోలు చరిత్రను తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుందని చెప్పారు. మరుగునపడ్డ ఎన్నో పురాతన పదాలను ఈ నిఘంటువు వెలుగులోకి తెచ్చిందని అంబేద్కర్‌ వర్సిటీ డీన్‌ ప్రొఫెసర్‌ సుధారాణి అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు, మానవవికాస పరిశోధనకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని రచయిత డాక్టర్‌ కాలువ మల్లయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో రచయిత పసునూరి రవీందర్‌, ప్రొఫెసర్‌ ముత్తయ్య, ప్రతినిధులు టీ రాజేందర్‌, కొండల్‌రెడ్డి, గాజుల శ్రీధర్‌, వెంకట్మ్రణ తదితరులు పాల్గొన్నారు. 


logo