శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:38

విద్యుత్‌ బిల్లులపై టారిఫ్‌ ముద్రణ

విద్యుత్‌ బిల్లులపై టారిఫ్‌ ముద్రణ

  • వినియోగదారుల సందేహాల నివృత్తికి డిస్కం యోచన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ బిల్లులపై టారిఫ్‌లను ముద్రించాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు యోచిస్తున్నారు. బిల్లు వెనుకభాగంలో దీనిని ముద్రించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో స్లాబులు, టారిఫ్‌ను ముద్రించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. నెలనెలా విద్యుత్‌ బిల్లులు వస్తున్నప్పటికీ ఏ క్యాటగిరీ, స్లాబ్‌ కింద పరిగణనలోకి తీసుకుంటున్నారో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కోసారి ఎక్కువ బిల్లులు వచ్చాయని, బిల్లులో వ్యత్యాసాలుంటున్నాయని గగ్గోలుపెడుతున్నారు. వీటిపై నెలనెలా ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది ఉన్నతాధికారులను సైతం ఆశ్రయిస్తున్నారు. వాస్తవంగా విద్యుత్‌ బిల్లులపై టారిఫ్‌ను ముద్రించాలని విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) గతంలోనే ఆదేశించినా అది అమలుకావడం లేదు. డిస్కంల పరిధిలో అధికారులు పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు. వరంగల్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) మాత్రం బిల్లులపై టారిఫ్‌ను ముద్రిస్తున్నది. క్యాటగిరీలవారీగా ఈఆర్సీ ఆమోదించిన స్లాబులన్నింటినీ ముద్రిస్తున్నది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లోనూ టారిఫ్‌లను ముద్రించాలని వినియోగదారులహక్కుల సంఘాలు కోరుతున్నాయి. టారిఫ్‌లను ముద్రించకపోవడం ఈఆర్సీ ఆదేశాలను ధిక్కరించడమేనని పేర్కొంటున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే వినియోగదారులు బిల్లుపై విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది.logo