బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:18:51

పరిశ్రమలకు ఎర్ర తివాచీ

పరిశ్రమలకు ఎర్ర తివాచీ

  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీఎస్‌ఐఐసీ ఆహ్వానం
  • పలు పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపునకు సుముఖం

హైదరాబాద్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్‌ఐఐసీ కార్యాచరణ ప్రారంభించింది. అర్హతలు, రిజర్వేషన్లు, ప్రాజెక్టు నివేదిక తదితర అంశాల ఆధారంగా ప్లాట్లను కేటాయించనున్నారు. ప్రత్యేకంగా నిర్ణయించిన జోన్లలో నిర్దేశించిన పరిశ్రమలను స్థాపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  స్థానిక అవసరాలు, ముడిసరుకు లభ్యత ఆధారంగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నది. వివిధ జిల్లాల్లో పదిహేను ఎకరాల నుంచి 2,500 ఎకరాల విస్తీర్ణంలో లేఔట్లను అభివృద్ధిచేశారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను కల్పించారు. ఉద్యోగులు, కార్మికుల వసతికోసం భూములు కేటాయించారు. సరుకు రవాణా కోసం తగిన ఏర్పాట్లు చేశారు.  ఈ పారిశ్రామికవాడల్లో ఇప్పటికే చిన్న చిన్న కుటీర పరిశ్రమల దగ్గరనుంచి బీపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జీవీకే, ఐటీడబ్ల్యూ సిగ్నోడే, అరబిందో ఫార్మా వంటి బడా సంస్థలు కొలువుదీరాయి. ఈ పారిశ్రామికవాడల్లో మిగిలిఉన్న ప్లాట్లను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చి.. పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

జోన్లవారీగా ఖాళీల వివరాలు 

సైబరాబాద్‌ జోన్‌ వికారాబాద్‌ పరిధిలో జనరల్‌ ఇంజినీరింగ్‌, స్టీల్‌రే- రోలింగ్‌, ఆటోమోటివ్‌ బేస్డ్‌ యూనిట్లు పెట్టుకోవచ్చు. కరీంనగర్‌జోన్‌ కుందన్‌పల్లిలో ఆటోమోటివ్‌ బేస్డ్‌ ఇండస్ట్రీకి స్థలాలను ఇస్తారు. ఖమ్మం పరిధిలో భద్రాచలం, కొత్తగూడెం, అన్నారగూడెం, పాల్వంచ, బుగ్గపాడులో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశమున్నది. బుగ్గపాడులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మిగిలినచోట్ల ఇష్టం వచ్చిన పరిశ్రమ పెట్టుకోవచ్చు. మేడ్చల్‌-సిద్దిపేట పరిధిలో బండ మైలారం, కుషాయిగూడ, మౌలాలి, సిద్దిపేట మందపల్లి, బీటీ పార్క్‌, కర్కపట్ల, జీడిమెట్ల, కుచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, చర్లపల్లి, తూప్రాన్‌, తొగుటలో వివిధ పరిశ్రమలు పెట్టుకోవచ్చు. బండమైలారంలో ఆగ్రో ప్రాసెసింగ్‌, బీటీ పార్క్‌లో బయోటెక్‌, కర్కపట్లలో బయో ఫార్మా, జీడిమెట్లలో హౌసింగ్‌, తూప్రాన్‌లో ఆటోమోటివ్‌, మిగిలినవి జనరల్‌ క్యాటగిరీలో ఉన్నాయి. నిజామాబాద్‌ జోన్‌లోని బోధన్‌లో ఆటోమోటివ్‌ ఇండస్ట్రీస్‌కు కేటాయించి, నిర్మల్‌, సారంగాపూర్‌లో జనరల్‌ క్యాటగిరీలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు. పటాన్‌చెరులో పాశమైలారం, ఐడీఏ ఇంద్రకరణ్‌, బుచినేపల్లి, మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌, సుల్తాన్‌పూర్‌ జనరల్‌ పార్క్‌, ఎలుమల టెక్స్‌టైల్‌ పార్క్‌ తదితర పార్కుల్లో టెక్స్‌టైల్‌, ఆయిల్‌, మెడికల్‌, కార్గో తదితర పరిశ్రమలకు రిజర్వుచేశారు. శంషాబాద్‌ జోన్‌లో ఆదిబట్ల, మహేశ్వరం, కొంగరకలాన్‌, ఇబ్రహీంపట్నం, నాదర్‌గుల్‌, మంకాల్‌, జడ్చర్ల ప్రాంతాల్లో ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్‌, సోలార్‌, రైస్‌ హబ్‌, ప్లాస్టిక్‌, గ్రీన్‌ ఇండస్ట్రీలకు.. మహేశ్వరం, ఐపి పాలెమ్‌లలో జనరల్‌ క్యాటగిరీ పరిశ్రమలకోసం వరంగల్‌ జోన్‌లో రాంపూర్‌, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, మడికొండ, టెక్స్‌టైల్‌ పార్క్‌ కల్లెమ్‌లలో టెక్స్‌టైల్‌, ఐటీ, జనరల్‌ క్యాటగిరీలో పరిశ్రమలకు ప్లాట్లు ఇస్తారు. యాదాద్రిలోని ఐడీఏ కోదాడలో జనరల్‌కు రాయిరావ్‌పేట్‌లో ఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నారు. logo