గల్లీలో లొల్లి.. ఢిల్లీలో మౌనం

- కృష్ణాజలాలపై నిన్నటిదాకా బీజేపీ నేతల హంగామా
- తొమ్మిది నెలలుగా వాయిదాపడుతున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్
- కేంద్రంపై ఒత్తిడితేకుండా రాష్ట్రంలో కమలనాధుల లొల్లి
ఉత్తుత్తి లేఖలతో కృష్ణాజలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయం ఆగిపోతుందా? ప్రచార ఆర్భాటంతో జలాల్లో వాటా పెరుగుతుందా? అసలు నీటి వివాదాలు తేలేది ఢిల్లీలోనా.. గల్లీలోనా?! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిసినా స్థానిక బీజేపీ నేతలు లొల్లిలొల్లి చేస్తున్నారు. కృష్ణా జలాలపై నిన్నటిదాకా హడావుడి చేసిన కమలనాథులు తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదును ఆసరాగా చేసుకొని కేంద్రం, నదుల అనుసంధాన నాటకమాడుతుంటే ప్రేక్షకుల్లా చూస్తున్నారు. గల్లీలో గోల చేస్తూ.. ఢిల్లీలో మౌనం వహిస్తున్న బీజేపీ నాయకులపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి భారీఎత్తున కృష్ణాజలాలను తరలించుకుపోయేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణకూ సిద్ధమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం.. ఆపై జరిగిన పరిణామాల నేపథ్యంలో బోర్డు సమావేశం వరకు కథ నడిపించిన కేంద్ర సర్కారు, తర్వాత ఉలుకులేదు.. పలుకులేదు. ముఖ్యంగా ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు చాలా హడావుడి చేశారు. కేంద్ర జల్శక్తికి తాము ఫిర్యా దు చేయడం వల్లనే కదలిక వచ్చిందంటూ ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శించారు. లోతుగా పరిశీలిస్తే.. ఈ వ్యవహారం మాటున కేంద్ర జల్‌శక్తి తన సొంత ఎజెండాను చక్కబెడుతుందనే వాస్తవాలు బయటపడ్డాయి. తెలుగురాష్ర్టాల్లో ప్రాజెక్టుల వివరాలన్నింటినీ తెప్పించుకొని నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి-కావేరీ మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిని గుర్తించిన తెలుగురాష్ర్టాలు అప్రమత్తం కావడంతో జల్‌శక్తి ఉన్నతాధికారుల హడావుడి కూడా తగ్గిపోయింది.
కొనసాగుతున్న వాయిదాల పర్వం
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉన్నది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణలో సమర్థ వాదనలు వినిపిస్తూనే.. మరోవైపు సెక్షన్-3పై సుప్రీంకోర్టులోనూ పోరాడుతున్నది. తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీపై తుదినిర్ణయాన్ని ప్రకటించకుండా బ్రిజేశ్ ట్రిబ్యునల్ గత ఆగస్టు నుంచి విచారణ పేరిట వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నది. వాస్తవంగా గతేడాది సెప్టెంబర్ 24-27 తేదీల్లో జరుగాల్సిన విచారణ నేటికీ జరుగకపోవడంపై ట్రిబ్యునల్ కారణాలు వెల్లడించలేదు. పరిణామాలను పరిశీలిస్తే.. పూర్తిస్థాయి బెంచ్ లేకపోవడం వల్లనే విచారణ జరుగడంలేదనేది తెలుస్తున్నది. ఈ ట్రిబ్యునల్‌లో చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్తోపాటు కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, ఒడిశాకు చెందిన జస్టిస్ బీమాల ప్రసాద్‌దాస్ సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 22న జస్టిస్ ప్రసాద్దాస్ను ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర మానవహక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించడంతో ట్రిబ్యునల్‌కు రాజీనామా చేశారు. దీంతో బ్రిజేశ్ ట్రిబ్యునల్ పూర్తిస్థాయి బెంచ్లేకపోవడంతో వాయిదాలపర్వం కొనసాగుతున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ హడావుడి చేస్తున్న బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై కేంద్రంపై ఒత్తిడితేవాలని తెలంగాణవాదులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ
- 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెన్సీలో అండర్-19 కప్ అందుకున్న భారత్
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
- భార్యపై అనుమానంతో కూతురు ఉసురుతీశాడు
- మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి