గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 02:42:54

ఆరేండ్ల పోరాటానికి అపెక్స్‌ విజయం

ఆరేండ్ల పోరాటానికి అపెక్స్‌ విజయం

  • రాష్ట్ర నీటివాటాల పెంపునకు లైన్‌ క్లియర్‌..  సెక్షన్‌-3 అమలును సాధించిన తెలంగాణ
  •  గోదావరి ‘మిగులు’ కేటాయింపుపైనా కార్యాచరణ..  సీఎం కేసీఆర్‌ వాదనతో ఏపీ అక్రమ ప్రాజెక్టుకు చెక్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది. ఏడాదిపాటు కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూసి, ఆపై సుప్రీంకోర్టు తలుపు తట్టి మరో ఐదేండ్లు పరిష్కారానికి వేచి ఉన్న తెలంగాణకు కృష్ణాజలాల కేటాయింపుల్లో ఊరట కలుగనున్నది. మంగళవారం నాటి రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ వాదనలతో ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-3 కింద కృష్ణాజలాలు కేటాయించాలన్న డిమాండుపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ట్రిబ్యునల్‌ ద్వారా త్వరితగతిన నీటి కేటాయింపులకు సిద్ధమని ప్రకటించారు. దీంతో కృష్ణాజలాల్లో మన వాటా పెంచుకోవచ్చని సాగునీటి నిపుణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన 811 టీఎంసీల కేటాయింపుల్లో.. ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు అనే తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణాజలాల పంపిణీ కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై సుదీర్ఘంగా పోరాడుతున్నది. పోరాటం ఫలించడంతో.. దశాబ్దాలుగా కృష్ణాజలాల్లో జరుగుతున్న అన్యాయం, రెండు రాష్ర్టాల పరిధిలో నదీపరివాహక ప్రాంతం, తాత్కాలిక కేటాయింపులు, అవతలి బేసిన్‌కు జలాల్ని ఏపీ అక్రమంగా తరలిస్తుండటం తదితరాలను ఇప్పుడు తెలంగాణ మరోసారి వెల్లడించే అవకాశం దక్కనున్నది. 

గోదావరిలోనూ వాటా పెంపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే గోదావరిజలాల్లో తెలంగాణకు 967.94 టీఎంసీల కేటాయింపు ఉన్నది. అయితే ఏటా మూడు వేల టీఎంసీలకు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నందున ఇంకా వినియోగించుకునే అవకాశం కూడా ఉన్నది. సముద్రంలోకి వృథాగా పోయే బదులు మనం వాడుకుందామని సీఎం కేసీఆర్‌ ఏపీకి కూడా పలుమార్లు హితవు పలికారు. ఈ అంశాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌లో కేసీఆర్‌ వివరించడంతో ఏపీ సీఎం జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో రెండు రాష్ర్టాల అభ్యర్థనతో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. దీనిని తెలంగాణకు దక్కిన మరో విజయంగా అభివర్ణిస్తున్నారు. 

ఇరుకున పడిన ఏపీ

శ్రీశైలం నుంచి మరిన్ని కృష్ణాజలాల్ని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ తెరతీసిన రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ గట్టిగా వాదించడంతో ఏపీ ఇరకాటంలో పడింది. అక్రమ ప్రాజెక్టుల్ని ఆపకపోతే తామూ ఎగువన అలంపూర్‌-పెద్ద మరూర్‌ దగ్గర బరాజ్‌ నిర్మిస్తామని కేసీఆర్‌ ఒకవిధంగా హెచ్చరిక జారీచేశారు. రాయలసీమ లిఫ్టుపై ముందుకు పోవద్దని గతంలో కేంద్రం ఆదేశించినా ఏపీ ఉల్లంఘించిందంటూ కేంద్రమంత్రికి కేసీఆర్‌ గుర్తుచేయడం కూడా ఏపీని ఇరుకున పెట్టింది. డీపీఆర్‌ సమర్పించి, అనుమతుల తర్వాతే ఆ ప్రాజెక్టుపై ముందుకుపోవాలని జగన్‌కు కేంద్రమంతి సూచించడం తెలంగాణకు లభించిన మరో విజయంగా చెప్తున్నారు. 


logo