శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:57:56

బీజేపీ నేతలది చిల్లర రాజకీయం

బీజేపీ నేతలది చిల్లర రాజకీయం

  • నిధులివ్వరు.. మిషన్లను దారి మళ్లిస్తారు
  • దీపాలు.. చప్పట్లు అంటూ పిలుపులిస్తారు
  • మాటలు తప్ప చేతలులేని కేంద్ర సర్కారు
  • రాష్ట్రంలో మాత్రం విమర్శలు.. ధర్నాలు
  • వారం రోజుల్లోగా టిమ్స్‌ ప్రారంభం 
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుంటే.. కొందరు నేతలు చిల్లర రాజకీయాలుచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తమ రాజకీయ ప్రయోజనం కోసం హాస్పిటల్‌ ముందు ధర్నాలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తక్కువచేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవాలని హితవుచెప్పారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.214 కోట్లు మాత్రమే నిధులిచ్చి చేతులు దులుపుకొన్నదని చెప్పారు. దీపాలు వెలిగించండి.. చప్పట్లు కొట్టండి అంటూ మాటలకే పరిమితమైన కేంద్రం.. చేతల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. రోజుకి 3,500 నుంచి నాలుగువేల పరీక్షలు చేయగల సామర్థ్యమున్న కోబాస్‌- 8800 మిషన్లను దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్‌చేస్తే.. భారత్‌కు రాగానే కోల్‌కతాకు తరలించుకొనిపోయిన కేంద్ర వైఖరిని మంత్రి ఈటల తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం తప్పులను పక్కనపెట్టి పరీక్షలు తక్కువచేస్తున్నారంటూ విమర్శలుచేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. సోమవారం వెంగళరావ్‌నగర్‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్షించారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో ఇప్పటివరకు రోజుకు 2,290 పరీక్షలనుచేసే సామర్థ్యముండగా.. వారం రోజుల్లో మరో 4310 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకొని రోజుకు 6,600 పరీక్షలు చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు తరలించకుండా ఉంటే మరో నాలుగువేల పరీక్షలుచేసే సామర్థ్యం తెలంగాణకు ఉండేదని గుర్తుచేశారు. 

వారంలో టిమ్స్‌ ప్రారంభం

వారంరోజుల్లోపు గచ్చిబౌలి హాస్పిటల్‌ (టిమ్స్‌)ని ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. టిమ్స్‌కు ఇంచార్జిగా ప్రొఫెసర్‌ విమలాథామస్‌ను నియమించాలని సూచించారు. అందులో సిబ్బందిని 50శాతం చొప్పున వారం వారం మారేట్లుగా పని విభజన చేయాలన్నారు. మూడు షిఫ్టుల్లోనూ సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు. రాత్రిపూట పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండేవారిని నియమించాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలోనే కరోనా లక్షణాలను కనుక్కొని పరీక్షలు చేయించేవిధంగా ఏర్పాట్లుచేయాలన్నారు. సెకండరీ, టెర్షయరీ స్థాయి దవాఖానల్లో 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రోగులు గంటలతరబడి వేచిచూసే విధానానికి స్వస్తి పలుకాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కరోనా చికిత్సకోసం వస్తున్న రోగుల పట్ల ప్రైవేట్‌ దవాఖానలు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలుచేయాలని ప్రైవేట్‌ ల్యాబ్‌లను మంత్రి కోరారు. 

లక్షణాలు ఉంటేనే పరీక్ష

కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కరోనా పాజిటివ్‌ వచ్చిన కాంటాక్ట్‌ వ్యక్తులకు మాత్రమే పరీక్షలు చేయాలని మంత్రి ఈటల పునరుద్ఘాటించారు. ఐసీఎంఆర్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులను ఆదేశించారు. 104 ,108 ల పనితీరుపై సమీక్షించిన మంత్రి.. మరింత పకడ్బందీగా కాల్‌సెంటర్లు నిర్వహించాలని సూచించారు. దవాఖానల్లో మంచాలు లేక ఇబ్బంది పడేవారు, కరోనా సంబంధిత ఇబ్బందులు తలెత్తినవారు 104కి ఫోన్‌చేయాలని కోరారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారికోసం టెలిమెడిసిన్‌ విభాగం మరింత సమర్థం పనిచేయాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ వైరస్‌ నాకు సోకదనే నిర్లక్ష్యం తగదని ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. 


logo