గురువారం 02 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:59:52

పది పరీక్షలు రద్దు

పది పరీక్షలు రద్దు

  • విద్యార్థులందరూ పై తరగతులకు నేరుగా ప్రమోట్‌
  • ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు
  • 5,34,903 మంది విద్యార్థులకు మేలు
  • ఇప్పటికే 2 సబ్జెక్టుల్లో 3 పరీక్షలు పూర్తి
  • మిగిలిన ఎనిమిది పరీక్షలు పూర్తిగా రద్దు..
  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సీఎం పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్‌ మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లను నిర్ణయించి పై తరగతులకు ప్రమోట్‌చేయాలని సీఎం నిర్ణయించారు. భవిష్యత్‌ పరిస్థితులను బట్టి డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం తీర్మానించింది. 

రాష్ట్రంలో మొత్తం 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు సంబంధించి 11 పేపర్లు ఉండగా అందులో రెండు సబ్జెక్టులకు చెందిన మూడు పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదావేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షాసమావేశంలో పదో తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్రంలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారుచేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌,  సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌, కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

15 వరకు ధాన్యం కొనుగోళ్లు

పంటలు ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో జూన్‌ 15 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్‌ రూరల్‌, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి విజ్ఙప్తులు వచ్చాయని, ఈ జిల్లాల్లో కొనుగోళ్లు కొనసాగించాలన్నారు.


logo