గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:13:11

ఆన్‌లైన్‌ పాఠాలకు అంతా సిద్ధం

ఆన్‌లైన్‌ పాఠాలకు అంతా సిద్ధం

  • రేపటి నుంచి డిజిటల్‌ బోధన
  • క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఊళ్లన్నీ డప్పు చప్పుళ్లతో మార్మోగుతున్నాయి. మైకులతో హోరెత్తుతున్నాయి. గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరిలో హడావుడి మొదలైంది. ఇదం తా ఎన్నికల కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆన్‌లైన్‌ బోధన కోసం. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభంకానున్న డిజిటల్‌/ఆన్‌లైన్‌ పాఠాల కోసం. కొవిడ్‌-19 నేపథ్యంలో నేరుగా స్కూళ్లకు విద్యార్థులను అనుమతించలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో విద్యాశాఖ ఆన్‌లైన్‌ పాఠాలకు టైం టేబుల్‌ను తరగతులు, సబ్జెక్టులవారీగా విడుదల చేసింది. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ వంటి చానళ్ల ద్వారా 3వ తరగతి నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పాఠాలు ప్రసారం మొదలు పెడుతున్నారు. అందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు నెలల విరామం తర్వాత స్కూళ్లకు వచ్చిన హెడ్‌మాస్టర్లు, టీచర్లు, గ్రామస్థుల భాగస్వామ్యంతో డిజిటల్‌ పాఠాల టైం టేబుల్‌ గురించి ఇంటింటికి వెళ్లి చెప్పడమేగాక గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఈ మేరకు డిజిటల్‌ పాఠాలు వినేలా తల్లిదండ్రులు తమ పిల్లలను సంసిద్ధులను చేస్తున్నారు. టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. 


logo