శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 01:38:44

బస్సులకు రైట్‌ రైట్‌

బస్సులకు రైట్‌ రైట్‌

  • రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనం
  • గ్రీన్‌జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి
  • కంటైన్మెంట్‌ ప్రాంతాలు తప్ప.. అన్నీ  గ్రీన్‌ జోన్లే
  • సెలూన్లు సహా అన్ని రకాల దుకాణాలు తెరుచుకుంటాయి
  • బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు నడిచేందుకు అనుమతి
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిగా పనిచేయవచ్చు
  • విద్యాసంస్థలు, ప్రార్థనామందిరాలు, క్లబ్లులు, పార్కులు బంద్‌
  • సభలు, ర్యాలీలు నిషేధం.. 31దాకా లాక్‌డౌన్‌ పొడిగింపు
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందన్నారు. 31 తరువాత లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ, సడలింపులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పలు కార్యకలాపాలకు అనుమతివ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. సెలూన్లు సహా అన్ని దుకాణాలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పూర్తి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నడుస్తాయని పేర్కొన్నారు. అయితే అందరూ కొవిడ్‌-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

కంటైన్మెంట్‌జోన్లు తప్ప మిగిలినవన్నీ గ్రీన్‌జోన్లే

రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప అన్ని జోన్లను గ్రీన్‌ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్‌ చేస్తున్నది. కంటైన్డ్‌ ఏరియాలో ఇప్పటికే ప్రభావితమైన ఇండ్లు, వ్యక్తులు, పరిసరాలలో ఏ మేరకు కంటైన్‌ చేయాలన్నదానిపై ఒక సాంకేతిక వ్యవస్థ ఉన్నది. దాని ప్రకారం 1,452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్‌ ఏరియాలో ఉంటాయి. వీళ్లు రెడ్‌జోన్‌లో ఉంటారు. దానిచుట్టూ బారికేడ్లు పెడుతారు. పోలీసు పహారా ఉంటుంది. అక్కడినుంచి ఎవరినీ బయటికి, బయటివారిని లోపలికి అనుమతించరు. వీళ్లకు కావాల్సిన నిత్యావసర సరుకులు, మెడిసిన్‌, వైద్య అవసరాలు అన్నీ డోర్‌డెలివరీ ద్వారా ప్రభుత్వమే సమకూరుస్తుంది. వాళ్లంతా కూడా ప్రభుత్వ నిబంధనలను దయచేసి ఫాలో కావాలి. వాళ్ల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్లు సహకరించాలి. ఇండియా బ్యాక్‌టు వర్క్‌ అని వార్తలు వస్తున్నాయి. 

వివిధ రాష్ర్టాలు అవలంబిస్తున్న విధానాలు పరిశీలించాం. వీటిల్లో మనకు అనుకూలమైన పద్ధతులు మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. మొన్న మున్సిపాలిటీల్లో కొన్ని షాపులు, గ్రామాల్లో మొత్తం షాపులు తెరిచాం. గ్రీన్‌ జోన్లలో కొన్ని అనుమతులు, సడలింపులు ఇచ్చాం. భగవంతుడి దయవల్ల ఎక్కడా చెడు జరుగలేదు. హైదరాబాద్‌ పరిధిలో కరోనా వెరీ లిమిటెడ్‌గా ఉన్నది. ఒకే అపార్ట్‌మెంట్లో 30 మందికి వచ్చింది. ఒకటే ఇంట్లో పది మందికి వచ్చింది. అలాంటి ప్రాంతాల చుట్టూ గీత గీసి కఠినాతి కఠినంగా.. బయటికి రాకుండా కంటైన్‌ చేయాలని నిర్ణయించాం. మిగిలిన ఏరియా ఫ్రీ అయిపోతది. అయినా అప్రమత్తంగా ఉండాలి. డేంజరెస్‌ వైరస్‌ కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. గతంలో చెప్పినట్టు 17 వేల బెడ్లు రెడీగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. వెనుకాముందు చూసుకొనే సడలింపులు ఇస్తున్నాం.


కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి

ఇప్పుడప్పుడే కరోనాకు మందు వచ్చే పరిస్థితిలేదని శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఎన్ని నెలలు కొనసాగుతుందో ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రపంచం, దేశం, మన రాష్ట్రం మందున్న ఏకైక ఆప్షన్‌.. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవడమే. అంతకుమించి గత్యంతరంలేదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగాలి. ఇంకా బతుకులు బంద్‌ పెట్టుకుని అనేక నెలల తరబడి కూర్చోలేం. మరింత కష్టమైతది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దానిప్రకారం హైదరాబాద్‌ నగరం తప్ప.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సెలూన్లు సహా అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చు. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో సరి బేసి విధానం ఉంది. ఇప్పటినుంచి సగంసగం ఉండదు. అందరు వారివారి వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నగరంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నిర్ణయంచేసి ప్రకటిస్తారు. కంటైన్మెంట్‌ ఏరియాలో మాత్రం ఏదీ తెరువడానికి అనుమతించరు.  

మాస్క్‌ తప్పనిసరి

మాస్క్‌ పెట్టుకోవడం అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలి. ధరించనివారికి వెయ్యిరూపాయల ఫైన్‌ ఉంటుంది. భౌతికదూరం సైతం పాటించాలి. ఎవరికి వారే నియంత్రణ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఆపాలన్నది కాకుండా వ్యక్తిగతంగా శానిటైజేషన్‌ చేసుకోవాలి. దుకాణాల యజమానులు సైతం ప్రతి దుకాణం దగ్గర శానిటైజర్లు పెట్టాలి. ఇప్పటివరకు ఎన్ని నిబంధనలు పెట్టినా, ప్రజలు చాలాబాగా సహకరించారు. అందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా.  

ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి


రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయి. అయితే హైదరాబాద్‌లో సమస్య ఉంది కాబట్టి సిటీ బస్సులు అనుమతించడం లేదు. ఇంటర్‌స్టేట్‌ సర్వీస్‌లను కూడా అనుమతించడం లేదు. అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి వచ్చేది లేదు, మన రాష్ట్ర బస్సులు కూడా ఇతర రాష్ర్టాలకు పోవు. మన రాష్ట్ర సరిహద్దుల లోపలనే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు వస్తాయి. ఇమ్లీబన్‌కు రానివ్వరు. జూబ్లీ బస్టాండ్‌కు రానిస్తారు. దిల్‌సుఖ్‌నగర్‌ సైడు రానివ్వరు. ఎటైతే సమస్య ఉంటుందో అటు రానివ్వరు. సికింద్రాబాద్‌, జూబ్లీ వైపు సమస్య లేదు కాబట్టి జూబ్లీ సైడ్‌ రానిస్తరు. అక్కడి నుంచి ఆటో, ట్యాక్సీ అవసరం ఉన్నోళ్లు వినియోగించుకోవచ్చు. ఎల్బీనగర్‌ సైడ్‌ అడిగారు, సాధ్యం కాదని చెప్పాం. బస్సులు కచ్చితంగా 7 గంటలలోపు సేవలు ముగించాలి. దూర ప్రాంతాలకు వెళ్లే వాటికి.. కొన్ని ప్రత్యేక అవసరాల రీత్యా మాత్రమే మినహాయింపులు ఉంటాయి. 

అది కూడా ఓ గంట వరకు మాత్రమే. కానీ 99శాతం బస్సులు సాయంత్రం 7 గంటలకు సేవలు ముగించాలి. బస్సులతో పాటు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు, టాక్సీలు, అన్నీ నడుస్తాయి.  హైదరాబాద్‌ నగరంలో ఆటోలు, ట్యాక్సీలను అనుమతిస్తారు. ట్యాక్సీలో డ్రైవర్‌ ప్లస్‌ త్రీ.. ఆటోలో డ్రైవర్‌ ప్లస్‌ ఇద్దరికి మాత్రం అనుమతి ఉంటుంది. ఇది చాలా కఠినంగా పాటించాలి. ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించకుంటే.. పోలీసులు చలాన్లు విధిస్తారు. కంటైన్మెంట్‌ జోన్‌లోకి మాత్రం ఈగ- దోమ కూడా పోదు. మహారాష్ట్ర, ఏపీలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే బస్సులు అక్కడికి వెళ్లవు, రానివ్వం. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటేనే అంతర్రాష్ట్ర బస్సులు నడపాలని చెప్పింది. రోజూ బస్సులను శానిటైజ్‌ చేస్తారు. మాస్క్‌లు తప్పనిసరి.

వృద్ధులను కాపాడుకోవాలి


వదిలిపెట్టిండ్రు కదా అని అవసరంలేని వారంతా రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయవద్దు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం. ఎందుకంటే (కరోనా) మళ్లీ తిరగబెడితే టోటల్‌ లాక్‌డౌన్‌ మళ్లీ పెట్టాల్సి వస్తుంది. 65 ఏండ్లు దాటిన వృద్ధులను కుటుంబసభ్యులు దయచేసి బయట తిప్పొద్దు. అత్యవసరం అయితే తప్ప వృద్ధులను, చిన్నపిల్లలను బయటికి రాకుండాచేసి వాళ్లను కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. logo