బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:18:24

స్వయం సమృద్ధికి తెలంగాణ స్ఫూర్తి

స్వయం సమృద్ధికి తెలంగాణ స్ఫూర్తి

  • ఈవోడీబీలో ప్రపంచ దేశాలతో కలిపి
  • స్థానం కల్పిస్తే టాప్‌ 20లో తెలంగాణ
  • డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని మళ్లీ తేవాలి
  • అమెరికా-ఇండియా సమ్మిట్‌లో కేటీఆర్‌

స్వయం సమృద్ధి సాధించాలంటే తెలంగాణ చేపట్టిన అనేక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు భారత్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. పెట్టుబడిదారులు భారత్‌ను ఒకే రీతిలో చూడకుండా, దేశంలో ఉన్న వివిధ ప్రగతిశీల రాష్ర్టాలు చేపడుతున్న కార్యక్రమాలను, వాటి పాలసీలను      గమనించాలి. ప్రపంచ దేశాలతో కలిపి తెలంగాణకు  ఈవోడీబీలో స్థానం కల్పిస్తే రాష్ట్రం ప్రపంచంలోనే టాప్‌- 20లో ఉండే అవకాశం ఉన్నది.

- కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించాలంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం వర్చువల్‌ విధానంలో జరిగిన యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం నిర్వహించిన అమెరికా- ఇండియా సమ్మిట్‌లో కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రస్తుత ఆపత్కాలంలోనూ అనేక అవకాశాలున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి భారత్‌కు అవకాశం ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడిదారులు యావత్‌ భారతాన్ని ఒకే రీతిలో చూడకుండా, దేశంలో ఉన్న వివిధ ప్రగతిశీల రాష్ర్టాలు చేపడుతున్న కార్యక్రమాలు, వాటి విధానాలను గమనించాలని కోరారు. ఆ దిశగా రాష్ర్టాలతో పెద్దఎత్తున ఎంగేజ్‌ కావాలని కోరారు. ఆరేండ్ల కిందట టీఎస్‌ఐపాస్‌ను ప్రవేశపెట్టి పెద్దఎత్తున కంపెనీలు రాష్ర్టానికి వచ్చేలా చేశామని గుర్తుచేశారు. ప్రపంచదేశాలతో కలిపి తెలంగాణకు సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో పోటీ కల్పిస్తే రాష్ట్రం ప్రపంచంలోనే టాప్‌- 20లో ఉండే అవకాశం ఉన్నదని ధీమా వ్యక్తంచేశారు. భారతదేశానికి యువశక్తి అత్యంత ఆకర్షణీయమైన వనరని, ఇక్కడి ప్రతిభ ఆధారంగా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రతిభ ఉన్న యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ ఏర్పాటుచేసి, ఐదేండ్లల్లో నైపుణ్య శిక్షణలో సేవలు అందిస్తున్నదని చెప్పారు. 

డ్యూయల్‌ డిగ్రీ విధానం అవసరం

విద్యార్థులు చదువుకుంటూనే పనిచేసుకునే వెసులుబాటు కల్పించే డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో డిజిటలైజేషన్‌తోనే అనేక సేవలు అందుకునే అవకాశం ఉన్నదని, విద్య విషయంలో డిజిటలైజేషన్‌ ముఖ్యమని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం టీసాట్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నదని తెలిపారు. భారతదేశంలో ఇన్నోవేషన్‌ను మరింత ప్రమోట్‌చేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా తమ ప్రభుత్వం ఐదేండ్ల కిందట దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ను, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, టీవర్క్స్‌ వంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను ప్రస్తుతం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇయర్‌గా ప్రకటించిందని పేర్కొన్నారు. దీనిద్వారా హెల్త్‌కేర్‌, వ్యవసాయరంగాలను మరింత బలోపేతంచేసేందుకు ముందుకొచ్చే ఎవరికైనా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.


logo