సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:33

అవ్వ.. ఇంటికి చేరింది

అవ్వ.. ఇంటికి చేరింది

  • పోలీసుల జోక్యంతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
  • ‘నమస్తే’ కథనానికి స్పందన 

భువనగిరి: అనాథగా రోడ్డుమీద వదిలేసిన వృద్ధురాలిని ఆమె మనుమలు చేరదీశారు. సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ‘బండి కిందే బతుకు’ కథనంతో జిల్లా అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ జాగృతి సభ్యులు కదిలిరావడంతో వృద్ధురాలి సమస్యకు పరిష్కారం దొరికింది. నాలుగు రోజులుగా భువనగిరి బస్టాండ్‌ సమీపంలోని చాట్‌బండార్‌ బండి కింద దుర్భర జీవితాన్ని గడుపుతున్న కిష్టమ్మ విషయాన్ని తెలుసుకున్న అధికారులు కుటుంబ సభ్యులను భువనగిరికి పిలిపించారు. వారికి నచ్చజెప్పడంతో జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేసిన మనుమలు నవీన్‌, నరేశ్‌లు తమ నానమ్మను జాగ్రత్తగా చూసుకుంటామని పోలీస్‌స్టేషన్‌లో సీఐ సుధాకర్‌కు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. మొదట దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. వృద్ధురాలి కథనాన్ని ప్రచురించి తిరిగి ఆమె ఇంటికి చేరువకోవడానికి తోడ్పాటునందించిన ‘నమస్తే తెలంగాణ’కు పలువురు అభినందనలు తెలిపారు.


logo