గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:48:53

మిన్నంటిన సంబురం

మిన్నంటిన సంబురం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన తరువాత ఊరూరా ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ బాణసంచా కాల్చి సంతోషాన్ని ప్రకటించారు. మరికొన్ని చోట్ల మిఠాయిలు పంచుకున్నారు. పేద ప్రజలు, రైతులు, నోరు లేని వారి కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆనందంతో చెప్పారు. ఎక్కడ చూసినా నూతన రెవెన్యూ చట్టంపైనే చర్చిస్తూ కనిపించారు. తెలంగాణ భవన్‌లో ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్‌ సరికొత్త చరిత్రను లిఖించారని రాములు అన్నారు.  


దేశానికే దశ దిశ

అవినీతి, ఆలస్యం బాధల నుంచి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే ది తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం. దేశానికే దశ దిశ చూపనున్నది. బుధ వారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంతో  రాష్ట్రంలో నవశకం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుకు  కృతజ్ఞతలు.

- ట్విట్టర్‌లో టీ హరీశ్‌రావు ఆర్థిక శాఖ మంత్రి

కొత్త చట్టంతో పండుగ వాతావరణం

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సీఎం కేసీఆర్‌కు అభినందనలు. పనుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. వాళ్లకు పెద్ద ఊరట లభించినట్లు అయింది. అవినీతి బెడద పూర్తిగా తొలిగిపోతుంది.

- తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పశుసంవర్ధకశాఖ మంత్రి

పంచాయతీలపై మరింత బాధ్యత

కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంతో పంచాయతీలపై బాధ్యత మరింత పెరిగింది. ఈ బాధ్యతను సర్పంచులు, కార్యదర్శులు నిబద్ధతతో నిర్వహించాలి. కొత్త రెవెన్యూ చట్టం వల్ల అవినీతి, అలసత్వంతోపాటు భూ సమస్యలు తగ్గిపోతాయి. సీఎం కేసీఆర్‌ గొప్ప సంస్కరణవాది. ఆయన చేపట్టిన సంస్కరణల్లో రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం. 

 - ఎర్రబెల్లి దయాకర్‌రావు,  పంచాయతీరాజ్‌శాఖ మంత్ర

పేదల కష్టాలు తీర్చేలా 

సీఎం కేసీఆర్‌ తీసుకున్న అనేక నిర్ణయాల్లో కొత్త రెవెన్యూ చట్టం కీలకమైనది. ఇది పేద రైతుల కష్టాలు తీర్చుతుంది. ఈ చట్టం భూముల క్రయ విక్రయాల్లో సం పూర్ణ పారదర్శకత తీసుకువచ్చి, అవినీతిని నిర్మూలించేదిగా ఉన్నది. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఈ చట్టం ద్వారా సీఎం కేసీఆర్‌ విముక్తి కలిగించారు. రైతులకు ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారనేది మరోసారి రుజువైంది.

- సత్యవతి రాథోడ్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

దశాబ్దాల సమస్యకు పరిష్కారం

దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న అన్నిరకాల భూసమస్యలకు ఈ బిల్లుతో పరిష్కారం లభిస్తుంది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సాహోసోపేతమైనది. పూర్తి పారదర్శకంగా ధరణి పోర్టల్‌ రూపొందించారు. అంగుళం భూమి ఆక్రమణకు కూడా అవకాశం ఉండదు. సీఎం కేసీఆర్‌ మూడేండ్లపాటు అన్నిరకాలుగా చర్చించి, రూపకల్పన చేసిన అద్భుత చట్టం. దీనిని అందరూ స్వాగతించాలి.   

- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి 

విప్లవాత్మక  చట్టం

తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ విప్లవాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకవచ్చారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించారు. రేపటి కోసం సరికొత్త చరిత్రను సృష్టించే విధంగా సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకవచ్చారు. 

 - ట్విట్టర్‌లో సంతోష్‌ కుమార్‌ , రాజ్యసభ సభ్యుడు


logo