సోమవారం 06 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:11

గురుకులాల గురువు మన పీవీ

గురుకులాల గురువు మన పీవీ

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ; గ్రామీణ, నిరుపేద విద్యార్థులు నాణ్యమైన విద్య ను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం మన పీవీయే. గురుకులాల పేరుతో ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఆయనే బంగారు బాటలు పరిచారు. 1971లో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌లో సీఎం హోదాలో తొలి గురుకులాన్ని నెలకొల్పారు. ఆ ఒక్క గురుకులం దేశవ్యాప్తంగా గురుకులాలు ఏర్పడటానికి కారణమైంది. సర్వేల్‌కు చెందిన సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి ఓ సందర్భంలో పశ్చిమబెంగాల్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ను సందర్శించారు. ఆయన సర్వేల్‌ ప్రాంతంలోనూ గురుకులం ఉంటే బాగుంటుందని తలచారు. తన ఆలోచనను నాటి సీఎం పీవీ నరసింహారావుతో పంచుకున్నారు. అప్పటికే శాంతినికేతన్‌ మాదిరిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న పీవీకి నారాయణ రెడ్డి ఆలోచన స్ఫూర్తిదాయకంగా అనిపించి సర్వేల్‌లో గురుకులం ఏర్పాటుకు బీజం వేశారు. 

పాఠశాల కోసం తన 40 ఎకరాల భూమిని దానం చేసేందుకు నారాయణరెడ్డి ముందుకురావడంతో 1971, నవంబర్‌ 23న పీవీ గురుకులాన్ని ప్రారంభించారు. సర్వేల్‌ తర్వాత కొన్ని నెలల్లోనే ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ వద్ద ఒక గురుకులం, అనంతపురం జిల్లాలో మరో గురుకులాన్ని ఏర్పాటు చేశారు. సర్వేల్‌ గురుకులం అతితక్కువ కాలంలోనే ఉత్తమ ఫలితాలను సాధించి ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు పెద్ద పెద్ద పదవులను చేపట్టారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, గవర్నర్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేంద్రమోహన్‌, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ దినకర్‌బాబు, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ సొసైటీ ఎండీ మల్లారెడ్డి, డీఐజీ టీ ప్రభాకర్‌రావు, వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ ఐజీ వై నాగిరెడ్డి, ఐఏఎస్‌ డాక్టర్‌ ఎల్‌ శశిధర్‌ తదితరులు సర్వేల్‌ గురుకులంలో చదువుకున్నవాళ్లే.


logo