గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 10:37:36

కిడ్నీ పేషెంట్ల జిమ్మేదార్‌ ప్రభుత్వానిది : మంత్రి ఈటల

కిడ్నీ పేషెంట్ల జిమ్మేదార్‌ ప్రభుత్వానిది : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కిడ్నీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే జిమ్మేదార్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సిరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిస్తూ... ఒక కుటుంబంలో డయాలసిస్‌ పేషెంట్‌ ఉంటే ఆ కుటుంబంలో ఎంత నరకం ఉంటుందో తమకు తెలుసన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కిడ్నీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. కంటి వెలుగు పథకంలో 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల చికిత్సలు జరగాలనేది తమ సిద్దాంతమన్నారు. పేదలు వైద్యంపై చేసే ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క సెంటర్‌లో ఐదు నుంచి పది మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోగుల తాకిడిని బట్టీ అవసరమైతే 24 గంటలు సేవలు అందిస్తామన్నారు. ఒక్క పేషెంట్‌ కూడా ఇబ్బంది పడని పద్దతుల్లో ఐదు, పది గంటలు వేచి ఉండకుండా రాగానే వైద్యం అందించే పద్దతిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది డయాలసిస్‌ పేషెంట్లు ఉన్నట్లుగా సమాచారం. ఒక్కొక్క రోగి మీద  రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ఒక లక్ష 80 వేల రూపాయలు ఖర్చుచేస్తుందన్నారు. అయినా ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా బాధితులకు వైద్య సేవలు అందిస్తామన్నారు. రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అదనపు డయాలసిస్‌ సెంటర్లు, అదనపు మిషన్లు, వాటిని ఆపరేట్‌ చేసే సిబ్బందిని నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు.


logo