బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:20:17

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

హైదరాబాద్‌ : షెడ్యూల్‌ కులాలు, తెగల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. నేటికి ఎస్సీ, ఎస్టీలు అత్యంత పేదరికం అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం కోసం ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు. ఈ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగానే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, ఆ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించాలని ఈ చట్టం నిర్దేశిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ప్రభుత్వంతో ఖర్చు చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.

ఎస్సీల కోసం 268, ఎస్టీల కోసం 169 ప్రత్యేక గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నడుపుతుందన్నారు. ఈ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద రూ. 20 లక్షల వరకు ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం ప్రభుత్వం టీఎస్‌ ప్రైడ్‌, సీఎంఎస్‌టీఈఐ పథకాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పెట్టుబడుల్లో రాయితీ, తగిన శిక్షణ, వ్యక్తిగత ప్రోత్సాహకాలను అందిస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 338 కోట్లు ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటివ్‌లను అందజేశామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.


logo