సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:02

రెవెన్యూ అవినీతిపై కొరడా

రెవెన్యూ అవినీతిపై కొరడా

  • దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏసీబీ
  • భారీగా పట్టుబడుతున్న నగదు
  • కీసర తాసిల్దార్‌ ఇంట్లో రూ.1.10కోట్లు
  • కేశంపేట తాసిల్దార్‌ వద్ద రూ.93 లక్షలు  
  • ప్రక్షాళన దిశగా  ప్రభుత్వం అడుగులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చాన్స్‌ దొరికిందంటే నోట్ల కట్టలపై కన్నేస్తారు.. రూ.వేల నుంచి రూ.కోట్ల దాకా బేరాలాడతారు.. కాసులు కురిపిస్తే వెంటనే కనికరం చూపుతారు.. జానెడు నేల నుంచి వేల ఎకరాల భూమి దాకా సెటిల్‌మెంట్ల ద్వారా ‘క్యాష్‌' చేసుకొంటారు.. ఇదీ రెవెన్యూశాఖలో అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్న అవినీతి. ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ అవినీతి అంతానికి రాష్ట్ర సర్కారు ఉగ్రరూపమే దా ల్చింది. లంచాసురులపై ఉక్కుపాదం మోపుతూ శాఖలోని చిన్న జలగల నుంచి పెద్ద అనకొండల వరకు అందరి పుట్టలను పెకిలించేస్తున్నది. ఏసీబీ అస్ర్తాన్ని ప్రయోగించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటున్నది. శాఖను పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నది. వాస్తవానికి, రెవెన్యూ మాయామశ్చింద్రలు ఎక్కువగా హైదరాబాద్‌ నగర శివా రు భూములపైనే కన్నేస్తున్నారు. హైదరాబాద్‌ చు ట్టూ ఉన్న శివారు భూముల విలువ రూ.కోట్లకు పెరగడంతో రియల్‌ఎస్టేట్‌ మాఫియా వీటిచుట్టే తిరుగుతున్నది. నిజమైన భూ యజమానులకు, స్థానికంగా ఉండే వారికి ఉన్న సమస్యలు, సరిహద్దు పంచాయితీలు, వారసత్వ మార్పుల్లోని లొసుగులు..ఇలా ఏ చిన్న పాయింట్‌ దొరికినా అటు అధికారులు, ఇటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. సెటిల్‌మెంట్లకు దిగుతూ సైలెంట్‌గా పనికానిచ్చేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని అవినీతి రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్నారు. దీంతో రెవెన్యూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టటంతో అవినీతి నాగరాజులు పుట్టల్లోంచి బయటికి వస్తున్నారు. రెవెన్యూశాఖలో అవినీతిపై సీఎం కేసీఆర్‌ స్వయంగా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదన్న చర్చ ఉన్నది. అందుకే శాఖ ప్రక్షాళనే సరైన ఆయుధమని ప్రభుత్వం భావిస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.

కొరడా ఝలిపిస్తున్న  ఏసీబీ

లంచాలకు అలవాటుపడ్డ అధికారులపై ఏసీబీ కొరడా ఝలిపిస్తున్నది. వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల అంగీకారం, అధికారుల సంపూర్ణ సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన కీసర డీల్‌ను సైతం ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేయడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సైలెంట్‌గా సీన్‌లోకి వచ్చిన ఏసీబీ అధికారులను చూసి కండ్లు బైర్లు కమ్మినంత పనైంది. భారీగా అవినీతి సొమ్ము వస్తుండటంతో చాలామంది ఇంటినే సేఫ్‌ ప్లేస్‌ అనుకొని నోట్ల కట్టలను దాచుకుంటున్నారు. ఇటీవల పెద్ద మొత్తంలో నగదు దొరికిన కేసుల్లో ఇదే విషయం తెలుస్తున్నదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.

నోట్ల కట్టల గుట్టలు పట్టుబడిన కేసులు మచ్చుకు కొన్ని..

  • గత ఏడాది జూలైలో కేశంపేట తాసిల్దార్‌ లావణ్య ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు రూ.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక అధికారి ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
  • కీసరలో భూవివాదం సెటిల్‌మెంట్‌లో ఏకమొత్తంలో రూ.1.10 కోట్ల భారీ లంచం తీసుకుంటూ కీసర తాసిల్దార్‌ నాగరాజు పట్టుబడ్డాడు. నోట్ల కట్టల్ని లెక్కపెట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ఏకంగా మిషన్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
  • హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ మండల పరిధిలోని ఓ వివాదాస్పద భూమికి సంబంధించి ప్రైవేటు వ్యక్తితో బేరం కుదుర్చుకోబోయిన షేక్‌పేట తాసిల్దార్‌ సుజాత ఇంట్లోనూ ఏసీబీ అధికారులు రూ.30 లక్షల నగదు కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
  • రూ.వేయికోట్లకు పైనే ఉన్నట్టు అనుమానిస్తున్న ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎంఎస్‌)స్కాంలోనూ ఏసీబీ అధికారులు ఒకేసారి రూ.4.47 కోట్లను ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనుగోలుకు ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మి ఈ డబ్బు ఇచ్చినట్టు తేలింది.


logo