మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:42:49

విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్‌ : విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విజయడైరీ రూ. 30 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితికి దిగజారిందని మంత్రి గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. స్వచ్ఛమైన పాలను సరఫరా చేసి వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. దీంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు మంత్రి.

2017-18 మరియు 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో విజయ డైరీ రూ. 35 కోట్ల లాభాలను గడించిందని హరీష్‌రావు తెలిపారు. ఈ లాభాలతో సంస్థకు ఉన్న అప్పు రూ. 25 కోట్లను చెల్లించి, మరో రూ. 16 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశామన్నారు. విజయడైరీ పురోగతికి పాటుపడుతున్న సంస్థ పాలకవర్గాన్ని, ఉద్యోగులు, రైతులను ప్రభుత్వం హృదయపూర్వకంగా అభినందిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. పాడిపరిశ్రమను బలోపేతం చేయడానికి రైతుల నుంచి సేకరించే పాలపై లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నదని మంత్రి తెలిపారు. దీంతో సుమారు 99,282 మంది పాడి రైతులు లబ్ధి పొందుతున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు.

2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 248.03 కోట్లు పాడి రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెల్లించిందన్నారు. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈ బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.


logo