బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:33

నీరా ఉత్పత్తుల ఆవిష్కరణ

నీరా ఉత్పత్తుల ఆవిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నీరా పాలసీని ప్రవేశపెట్టిందని, సీఎం కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న ఈ నిర్ణయంతో గీత కార్మికుల్లో ఆత్మగౌరవం పెరిగిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నీరాతో కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని చెప్పారు. సోమవారం ఆయన రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో తెలంగాణ పామ్‌ నీరా, పామ్‌ ప్రొడక్ట్స్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, వేద పామ్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసిన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను ఆవిష్కరించారు. 

రాష్ట్రంలో చేతి వృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. తాటి, ఈత చెట్ల నుంచి తీసిన నీరా ద్వారా సేంద్రియ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను తయారు చేస్తున్నారని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌, అంబాల నారాయణగౌడ్‌, వింజమూరి సత్యంగౌడ్‌, భానుచందర్‌, శ్రీనివాస్‌, ధర్మరాజు, రామ్మోహన్‌ గౌడ్‌, ఈతముల్లు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo