గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 02:08:18

మన తోట కూరగాయలు!

మన తోట కూరగాయలు!

  • రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి
  • దిగుమతి తగ్గించి దిగుబడి పెంచాలి
  • తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యానశాఖ నివేదిక

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుపై దృష్టి సారించింది. వినియోగం అధికంగా ఉండి సాగులో కొరత ఉన్న కూరగాయలను స్థానిక రైతులతోనే పండించాలని నిర్ణయించింది. దిగుమతులను తగ్గించే వ్యూహంతో రాష్ట్రంలో వినియోగమయ్యే కూరగాయలన్నింటినీ ఇక్కడే ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు కూరగాయల సాగును మూడులక్షల ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు, మన అవసరాలు, దిగుమతులపై రాష్ట్ర ఉద్యానశాఖ ఒక నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు సమర్పించింది. 

ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీరకాయ, పచ్చిమిర్చి, సొరకాయ, కాకరకాయ, క్యాప్సికం, చిక్కుడు, చామగడ్డ, క్యారెట్‌ వంటి కూరగాయల కొరత తీవ్రంగా ఉన్నట్టు ఉద్యానశాఖ ఆ నివేదికలో తెలిపింది. ఏటా దాదాపు రూ.600 కోట్ల విలువైన ఈ కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నట్టు పేర్కొన్నది. ఆయా రకాల ఆకుకూరలు, కూరగాయలను ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలన్న అంశంపై నివేదికలో సూచనలుచేసింది. దిగుమతి చేసుకుంటున్న ఈ కూరగాయలను ఇక్కడే సాగుచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే వాటిని అందించడంతోపాటు రైతులకు లాభాలు చేకూర్చవచ్చని తెలిపింది. 

కారం లోటు!

తెలంగాణ ప్రజలు కారంలేని కూర తినలేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో రోజూ 492 టన్నుల పచ్చిమిర్చిని వినియోగిస్తున్నారు. ఈ లెక్కన ఏటా 1.79 లక్షల టన్నుల మిర్చి వినియోగం అవుతుండగా, 21వేల టన్నుల మిరపకాయలను దిగుమతి చేసుకుంటున్నట్టు ఉద్యానశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ లోటును పూడ్చేందుకు రాష్ట్రంలో మరో 5,324 ఎకరాల్లో మిర్చి సాగును పెంచాలని సూచించింది. మిర్చిరకానికి చెందిన క్యాప్సికం రాష్ట్రంలో 5,773 టన్నుల మేర వినియోగమవుతున్నది. ఈ పంటను అక్కడక్కడా పాలీహౌజ్‌లలో సాగుచేస్తున్నారు. కాగా క్యాప్సికం సాగును ఓపెన్‌ ఏరియాలో 717 ఎకరాల్లో సాగుచేసేందుకు అవకాశమున్నదని, పాలీహౌజ్‌లలో 144 ఎకరాల్లో సాగు చేస్తే కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ తెలిపింది.

రూ.150 కోట్ల మేర ఉల్లి దిగుమతులు

ప్రతి వంటలో ప్రధానమైనది ఉల్లిగడ్డ. రాష్ట్రంలో రోజుకు సగటున 1205 టన్నుల చొప్పున ఏడాదికి 4.40 లక్షల టన్నుల ఉల్లిగడ్డను వినియోగిస్తున్నారు. కానీ 34వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లిని సాగుచేస్తున్నారు. ఎకరాకు 10 టన్నుల దిగుబడితో 3.41 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తున్నది. దీంతో దాదాపు లక్ష టన్నుల కొరత ఏర్పడుతున్నది. ఈ లోటును అధిగమించేందుకు మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొనేందుకు రూ.150 కోట్ల వరకు వెచ్చిస్తున్నాం. మరో 14 వేల ఎకరాల్లో ఉల్లి సాగును పెంచడం ద్వారా కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ సీఎం కేసీఆర్‌కు సమర్పించిన నివేదికలో సూచించింది.

1.41 లక్షల టన్నుల ఆలుగడ్డ లోటు

ఆలుగడ్డ మన అవసరాలకు సరిపోను సాగవడంలేదు. దాదాపు 1.41 లక్షల టన్నుల కొరత ఉన్నట్టు ఉద్యానశాఖ తన నివేదికలో వివరించింది. రాష్ట్ర ప్రజలకు రోజుకు 491 టన్నుల చొప్పున ఏడాదికి 1.79 లక్షల టన్నుల ఆలుగడ్డ అవసరం. ప్రస్తుతం 38వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్రంలో 17,676 ఎకరాల్లో ఆలుగడ్డ సాగును పెంచడం ద్వారా మన అవసరాలను తీర్చుకోవచ్చని ఉద్యానశాఖ తెలిపింది. 

బీరకాయ, కాకరకాయ అంతంతే..

బీరకాయ, కాకరకాయ, సొరకాయలు కూడా అవసరాల మేర సాగుకావడంలేదు. ఏటా రూ.58కోట్ల విలువైన బీరకాయ, రూ.57.15 కోట్ల విలువైన కాకరకాయ, రూ.23.02కోట్ల విలువైన సొరకాయ దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలో వివరించారు. ఈ మూడు కాయకూరల సాగును మరో 13 వేల ఎకరాల్లో పెంచాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది.

ఆకుకూరల సాగు పెంచాలి

రాష్ట్ర ప్రజలు ఏటా రూ.324 కోట్ల విలువైన ఆకుకూరలను తింటున్నారు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆకుకూరలు రాష్ట్ర అవసరాలకు తగినంతగా సాగు కావడంలేదు. కొత్తిమీరతోపాటు ఇతర ఆకుకూరలు రోజుకు 443.36 టన్నులు వినియోగమవుతున్నాయి. ఈ లెక్కన ఏడాది 1.62 లక్షల టన్నుల ఆకుకూరలు అవసరం. కానీ రాష్ట్రంలో 1.46 లక్షల టన్నుల ఆకుకూరలే సాగవుతున్నాయి. మరో 16వేల టన్నులు లోటుగా ఉన్నది. ఈ లోటును అధిగమించేందుకు ఆకుకూరల సాగును మరో 3,916 ఎకరాలకు విస్తరించాలని ఉద్యానశాఖ తన నివేదికలో పేర్కొన్నది. 


logo