శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:32:25

ధాన్యాగారంగా తెలంగాణ

ధాన్యాగారంగా తెలంగాణ

  • కండ్లులేని కబోదుల్లా ప్రతిపక్ష నేతల విమర్శలు
  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

యాదగిరిగుట్ట/స్టేషన్‌ఘన్‌పూర్‌/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశ ధాన్యాగారంగా మారబోతున్నదన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్నకందుకూరు, ఆలేరు మండలంలోని మంతపురిలో, జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని రాజవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యాసంగిలో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోటి టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. 

ఏప్రిల్‌ నెలలో ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే కూడా మునుపెన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్టు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్‌ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించడం వల్లే రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని సంతో షం వ్యక్తంచేశారు. ఇప్పటికిప్పుడు గోనె సంచుల కొరతను అధిగమిస్తూ, రవాణా, మిల్లర్లు, ట్రేడర్లు, ఎఫ్‌సీఐవారితో అనుసంధానం చేస్తూ ధాన్యాన్ని తరలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ.1,495 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు చెప్పారు.

 పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో గతంలో కంటే ఈసారి 20 వేల టన్నుల అదనపు దిగుబడి వచ్చిందని, ఇది టీఆర్‌ఎస్‌ సర్కారు ఘనతేనని తెలిపారు. రైతు ప్రభుత్వంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటుంటే.. కండ్లులేని కబోదుల్లా ప్రతిపక్ష నేతలు చిల్లరమల్లర ఆరోపణలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


logo