సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:39

రైతుల మేలుకోసమే ధరణి

రైతుల మేలుకోసమే ధరణి

  • ఎవరి భూమి వాళ్లకే ఉంటది.. 
  • గెట్టు పంచాయితీలుండవు:  సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులమేలు కోసమే ధరణి పోర్టల్‌ ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో మాట్లాడుతూ ‘ధరణి పోర్టల్‌లో మాట్లాడితే మొన్న ఎవడో ఫేస్‌బుక్‌లో పెట్టిండు. నువ్వు రైతు పిచ్చోడివా.. నీకు రైతు తప్ప ఇంకేది పట్టదా? అని ఎగతాళి చెసిండ్రు. నేను ఒకటే మాట చెప్పిన. కేసీఆర్‌ బతికుండగా రైతుబంధు ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్పిన. ఎనుకట జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదారులకు రక్షణ చట్టం తీసుకొచ్చిండ్రు. ఇయ్యాల జమీందారు లేడు జాగీర్‌దార్‌ లేడు. ఎవరి భూమి వాళ్లకే ఉంటది. మన ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం పిడికిలెత్తి మొత్తం సర్వేకు ఆర్డర్‌ ఇచ్చింది. కొద్దిరోజుల్లో సర్వే స్టార్ట్‌ అయితది. గెట్టు పంచాయితీ, చెట్టు పంచాయితీలు, పుట్ట పంచాయితీ ఉండదు. మొత్తం సర్వేచేసి దూద్‌కా దూద్‌.. పానీకా పానీ తేల్చేస్తరు. ఆ తర్వాత (కో-ఆర్డినేట్స్‌) అక్షాంశాలు, రేఖాంశాలనే హద్దుగా నిర్ణయించి ఇచ్చేస్తరు. ప్రతి సర్వేనంబర్‌కు, ప్రతి రైతుకు ఆ గెట్టు కొలిచి ఇచ్చేస్తరు. ఒక్కసారి అవి గవర్న్‌మెంట్‌ ఇచ్చిందంటే.. ఈ టెక్నాలజీ యుగంలో భూగోళం ఎన్ని రోజులుంటదో.. భూమికి అయస్కాంత శక్తి ఎన్ని రోజులు ఉంటదో.. ఎప్పటిదాక భూగోళం ఇచ్చుకపోదో.. అప్పటిదాక ఆంక్షాంశాలు, రేఖాంశాలు అట్లనే ఉంటయి. అప్పుడు చాలా అద్భుతమైన, ప్రశాంతమైన పల్లెలు ఉంటయి.

ఇవన్నీ కూడా దేనికోసం తెచ్చినం.. కేవలం రైతుల మేలుకోసమే. ప్రభుత్వం పెట్టిన సమగ్ర సర్వేలో రైతుబంధు కమిటీలు ముందర ఉండి.. సర్పంచులు, ఎంపీటీసీలు నాయకత్వం వహించి మీ గ్రామ భూములన్నింటినీ సత్వరం సర్వే చేయించుకోవాలె. లెక్కలు తేల్చాలె. అది ఒక్కసారి జరిగితే ఒకరి భూమిని ఒకరు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు. ధరణి పోర్టల్‌ చాలా గొప్పది. ఇవాళ మనం అందులో 1,48,58,000 ఎకరాలను నిక్షిప్తం చేసినం. మిగిలినయ్‌ వస్తనే ఉంటాయ్‌. సాదా బైనామాకు అవకాశం ఇచ్చినం వాళ్లవి కూడా అప్‌డేట్‌ అవుతాయి’ అని సీఎం అన్నారు.