గురువారం 28 మే 2020
Telangana - May 19, 2020 , 01:18:54

డిమాండ్‌ ఉన్న పంటలే వేస్తాం

డిమాండ్‌ ఉన్న పంటలే వేస్తాం

  • నియంత్రిత పంటల సాగు నేపథ్యంలో పలువురు రైతులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నియంత్రిత పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మెగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయా ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగుచేయాలని, ఆ విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రైతు బంధు సమితి అధ్యక్షులు, ఇతర రైతులు మాట్లాడుతూ.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నవాటిని సాగుచేస్తామని పేర్కొంటున్నారు.

నర్సంపేట మిర్చి నాణ్యతపై సీఎం ప్రశంస

మిర్చి నాణ్యతపై సీఎం కేసీఆర్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటను మెచ్చుకొన్నారు. నియంత్రిత పంటల సాగుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావుతో మాట్లాడారు. నర్సంపేట ప్రాంతంలో సాగయ్యే మిర్చి నాణ్యతతో ఉంటుందని, అంతర్జాతీయస్థాయిలో మంచి డిమాండ్‌ ఉన్నదన్నారు. ఈ మిర్చిని ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేసేందుకు అవసరమైన నాణ్యతను అధికారులు గుర్తించారన్నారు. అత్యధికంగా మక్కజొన్న దిగుబడిలో నర్సంపేట అగ్రస్థానం నిలిచిందని ప్రశంసించారు. ఒకే తరహాలో కాకుండా పత్తి, కంది, మినుము, పెసర సాగుపై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. నర్సంపేట భూములు ఆయిల్‌ఫామ్‌కు కూడా అనువైనవని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం భూమిని సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మిర్చి సాగులో నర్సంపేటను మోడల్‌గా తీసుకోవాలని ఇతర జిల్లాల అధికారులకు సూచించారు. అంతకుముందు ఏడీఏ నర్సంపేటలో మిర్చి సాగు వివరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు.

 పంట మార్పిడి మంచి నిర్ణయం

రైతు రాజులాంటోడు అంటూ పాలన సాగించిన ఎందరో నాయకులు ఎన్నడూ రైతును పట్టించుకోకపోయె. పైసా ఇయ్యకపోయె. రైతును పట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌. రైతుబంధు తెచ్చి ధైర్యం ఇచ్చిం డు. బీమాతో కుటుంబానికి భరోసా కల్పించిండు. పంట మార్పిడి మంచి నిర్ణయం. సీఎం కేసీఆర్‌ ఏం చెప్పినా, అది రైతులకు లాభం జరిగేదే. నాకు పది ఎకరాల భూమి ఉన్నది. అధికారులు ఏ పంట చెప్తె అదే పండిస్త. నీళ్లుండె.. కరెంటు ఇస్తుండె.. పెట్టుబడి సాయం అందిస్తుండె. 

 - అజ్మీర శివ, గాజె తండా(నల్లెల్ల), కురవి మండలం, మహబూబాబాద్‌ జిల్లా 

 కేసీఆర్‌సార్‌ చెప్పినట్టే వింటం

రైతుల క్షేమం గురించి అలోచించే సీఎం కేసీఆర్‌ చెప్పినట్టే అందరం వింటం. పండించిన పంటకు మద్దతు ధర రావాలంటే సీఎం చెప్పినట్టు సన్నరకం పంట వేస్తం. వానకాలంలో పత్తి, కంది వేస్తం. రైతుల క్షేమం గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి కాబట్టే సీఎం చెప్పినట్టు పంటలు వేసి, ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందుతం.

-నల్ల తిరుపతిరెడ్డి, రైతు, హిమ్మత్‌నగర్‌, వీణవంక మండలం, కరీంనగర్‌ జిల్లా

 ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించాలి

ఆర్డీఎస్‌ ఆయకట్టు పరిధిలో వరి మినహా ఏ పంటను సాగు చేసేందుకు అవకాశం లేదు. వానకాలంలో ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు పుస్కలంగా అందుతున్నది. ఆయకట్టు పరిధిలో వరిసాగు చేయడం అనాధిగా వస్తున్నది. పత్తి, మక్కజొన్న ప్రత్యామ్నాయ పంటల సాగును వ్యవసాయాధికారులు ప్రోత్సహించాలి.

- బోయ ఆంజనేయులు, రైతు, పులికల్‌, అయిజ, మహబూబ్‌నగర్‌


 ఎంతో అవగాహన వచ్చింది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు, రైతుల్లో వ్యవసాయ రంగం, పంట ఉత్పత్తులపై ఎంతో అవగాహన వచ్చింది. రైతులందరూ ఒకే పంటను పండించడం ద్వారా మార్కెట్‌లో ధరలేక రైతు నష్టపోతాడు. డిమాండ్‌ ఉన్న పంటను పండిస్తే రైతు కోరుకున్న విధంగా ధరలు వస్తాయి. తద్వారా రైతుకు నష్టం ఉండదు. సీఎం సూచించిన విధంగా అధికారులు చెప్పే పంటలనే రైతులు పండించేలా రైతుబంధు సమితి సభ్యులు పనిచేస్తారు. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాం.

- నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు 


logo