సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 03:52:32

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సెప్టెంబర్‌లో

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సెప్టెంబర్‌లో

  • 9, 10, 11, 14 తేదీలలో పరీక్ష
  • ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌
  • ఇతర పరీక్షలపై త్వరలో నిర్ణయం
  • అక్టోబర్‌లో అడ్మిషన్లు!
  • ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్ష ఫలితాలను 

సెప్టెంబర్‌ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత పది రోజుల విరామంతో అంటే అక్టోబర్‌ రెండోవారంలోగా ఇంజినీరింగ్‌ కాలేజీలలో అడ్మిషన్లకోసం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అదే నెలాఖరులోగా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తరగతులు (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) కూడా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది. సెప్టెంబర్‌లో 9, 10, 11, 14 తేదీలలో ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి మాత్రమే ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌జలీల్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పాల్గొన్నారు. ఎంసెట్‌లో ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగంతోపాటు ఎడ్‌సెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. టీసీఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, ఆ స్లాట్‌ ప్రకారం మిగిలిన ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారుచేస్తామని పాపిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 1-6 వరకు జేఈఈ మెయిన్‌, అదే నెల 13న నీట్‌ ఉండడంతో ఆ తేదీల్లో ఎంసెట్‌ నిర్వహించడంలేదని చెప్పారు. నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల ప్రిపరేషన్‌ కోసం సెప్టెంబర్‌ 12న కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించడం లేదన్నారు. 

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ

రాష్ట్రంలో ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలను కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను రెండు పూటలా శానిటైజ్‌ చేస్తారు. వాటర్‌ బాటిళ్లను విద్యార్థులే తెచ్చుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికదూరం పాటించేలా కంప్యూటర్‌ బేస్ట్‌టెస్ట్‌ (సీబీటీ) కేంద్రంలో చర్యలు తీసుకొంటారు. వైరస్‌వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను ప్రతిరోజు రెండు పూటలు నిర్వహిస్తారు. ఉదయం 18 వేలు, మధ్యాహ్నం 18 వేల చొప్పున విద్యార్థులకు ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

హైకోర్టులో కేసులు

ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు, ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నదని విద్యామండలి చైర్మన్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 9 నుంచి నిర్వహించనున్న ప్రవేశపరీక్షలకు సంబంధించి వివరణ హైకోర్టుకు వివరిస్తామని తెలిపారు. డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలపై కోర్టు తీర్పు తర్వాత నిర్ణయం వెలువరిస్తామన్నారు. 


logo