గురువారం 04 జూన్ 2020
Telangana - May 24, 2020 , 00:47:40

జూలై 6 నుంచి ఎంసెట్‌

జూలై 6 నుంచి ఎంసెట్‌

  • ఒకటిన పాలిసెట్‌, 4న ఈసెట్‌
  • మొత్తం 8 పరీక్షలు జూలైలోనే..
  • ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదాపడిన పలు ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. కొవిడ్‌-19 నిబంధనలు అనుసరించి ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలను పూర్తిచేస్తామని చెప్పారు. పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. టీఎస్‌ఎంసెట్‌-2020ని జూలై 6 నుంచి 9 వరకు నాలుగు రోజులపాటు వరుసగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తన కార్యాలయంలో శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌తో కలిసి మంత్రి ఎనిమిది ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను విడుదలచేశారు. టీఎస్‌ పీఈసెట్‌ను జూలై 16 తరువాత నిర్వహించనున్నారు. ఈ పరీక్ష తేదీలను తరువాత ప్రకటించనున్నారు. కొవిడ్‌-19 నిబంధనలు అమలుచేస్తూ, యూజీసీ సూచనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి సబిత తెలిపారు. 

దరఖాస్తులకు 31 వరకు గడువు 

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌తోపాటు అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పటివరకు ఎంసెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.1 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షల కోసం కన్వీనర్‌ నిర్ణయించిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ కేంద్రాలలో రెండు పూటలు పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించాల్సి ఉన్నందున ఎంసెట్‌ పరీక్షను నాలుగు రోజులు నిర్వహించనున్నారు. ఒక్కో రోజు రెండు పూటలా.. ప్రతి పూట 25 వేల చొప్పున రోజుకు 50 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు, ప్రవేశపరీక్షలు పూర్తిచేసిన రెం డు వారాల్లో ఫలితాలు విడుదల చేయడంతోపాటు నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం కోసం వెంటనే అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేయడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించించింది. 

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు 

జూన్‌ 8 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్‌ డీఈవోలను ఆదేశించారు. శనివారం ఆయన డీఈవోలతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు మాస్కులతో పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు.. 

ప్రవేశ పరీక్ష
యూనివర్సిటీ  
 తేదీలు
1. టీఎస్‌ పీజీఈసెట్‌
ఓయూ
జూలై 1-3
2. టీఎస్‌ ఈసెట్‌
జేఎన్‌టీయూహెచ్‌
జూలై 4
3. టీఎస్‌ ఎంసెట్‌
జేఎన్‌టీయూహెచ్‌
జూలై 6-9
4. టీఎస్‌ లాసెట్‌, 
 పీజీలాసెట్‌ ఓయూ
జూలై 10
5. టీఎస్‌ ఐసెట్
కేయూ
జూలై 13
6. టీఎస్‌ ఎడ్‌సెట్‌
ఓయూ
జూలై 15
7. టీఎస్‌ పీఈసెట్‌
ఎంజీయూ
జూలై 16 
8. టీఎస్‌ పాలిసెట్
ఎస్‌బీటీఈటీ
జూలై 1


logo