శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 01:01:37

షేర్‌ కా ఘర్‌.. తెలంగాణ

షేర్‌ కా ఘర్‌.. తెలంగాణ

  • మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పులుల వలస
  • ఆరేండ్లలో భారీగా పెరిగిన ఆవాసాలు
  • తాజాగా మానుకోట అడవుల్లో సంచారం

దట్టమైన అడవులు.. ఎత్తయిన కొండలు.. జాలువారే జలపాతాలు.. పొంగి పారుతున్న వాగులు.. నిండుకుండల్లా చెరువులు.. ఎగిరి దుంకుతున్న అలుగులు.. వన్యప్రాణులకు ఇంతకన్నా ఇంకేం కావాలి. అందుకే రాష్ర్టాలను దాటి తెలంగాణలోకి వలస వస్తున్నాయి. ఒకప్పుడు పడావుబడ్డ నేల, ఇప్పుడు పచ్చందాలతో కళకళలాడుతుంటే కనులారా చూడ్డానికి తరలివస్తున్నాయి. ముఖ్యంగా పులులు తెలంగాణ అడవులను తమ ఆవాసాలుగా మార్చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ:  మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో పులులకు సరిపోయే ఆవాసస్థలం లేకపోవడంతో.. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం- కిన్నెరసాని- పాకాల- ఏటూరునాగారం- అమ్రాబాద్‌ ప్రాంతాల్లోని అడవుల బాట పడుతున్నాయి. తాజాగా, సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్‌ గ్రామం జంగవానిగూడెం అటవీప్రాంతంలో పులి సంచరించినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆర్నెల్ల క్రితం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ నుంచి తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం చనాక- కోర్టా సరిహద్దు గ్రామాల్లో రెండు పులులు సంచరించాయి. అవి పెన్‌గంగను దాటి సమీపంలోని గ్రామాల్లో ఆవులు, రైతులపై దాడులు చేశాయి. సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి, ఏటూరునాగారం జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో పులి కనిపించడం విశేషం. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల  సంరక్షణ, రక్షణ, సౌకర్యాల కల్పనకు పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌తో కలిసి పనిచేయాలని తెలంగాణ అటవీశాఖ నిర్ణయించింది. ఇటీవలే ఉమ్మడి వర్క్‌షాపును కూడా నిర్వహించింది. పులులు సంచరించే అటవీప్రాంత పరిసర గ్రామాల ప్రజలకు పులుల నుంచి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలను చేపట్టాలని వర్క్‌షాప్‌లో నిర్ణయించారు. 

పులి ఆవాసానికి 25 చదరపు కిలోమీటర్లు

సాధారణంగా ఒక్కో పులి 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తడోబా ప్రాంతాల్లో పులుల సంఖ్య అధికంగా ఉంది. ఒక మగ పులి ఉన్న ఆవాసంలో మరో మగ పులి ఉండదు. ఆడ పులి ఉండటానికే అవకాశం ఉంటుంది. దీంతో వాటికి పుట్టిన సంతానంలో మగ పులిపిల్లలు 3 నెలలకు మించి ఆవాసంలో ఉండే అవకాశం ఉండదు. ఫలితంగా అవి కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణలోని టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి వలస వస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన అటవీ విస్తీర్ణం వల్లే పులులు ఇక్కడ ఆవాసాలను ఏర్పర్చుకొంటున్నాయని పేర్కొన్నారు.

ఏ ప్రాంతం నుంచి వచ్చిందో గుర్తిస్తున్నాం

మహబూబాబాద్‌ జిల్లాలో సోమవారం పులి సంచరించినట్లు గుర్తించాం. కొత్తగూడ మండలం రాంపూర్‌ గ్రామం జంగవానిగూడెం అటవీ ప్రాంతంలోకి కిన్నెరసాని, ఏటూరునాగారం అటవీ ప్రాంతాల నుంచి పులి వచ్చినట్టు భావిస్తున్నాం. ఏ వైపు నుంచి వచ్చిందనేది గుర్తించాల్సి ఉంది. కిన్నెరసాని, ఏటూరునాగారం ప్రాంతాల్లో  కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు నష్టం కలుగకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం. బీట్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పులి జాడను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో స్పష్టత రానున్నది. 

- శంకరన్‌, ఐఎఫ్‌ఎస్‌, వన్యప్రాణి నిపుణుడు