ఇన్నోవేషన్ ఇండెక్స్ టాప్-5లో మన రాష్ట్రం

- మెరుగైన, నైపుణ్య మానవ వనరుల కేంద్రం
- వరుసగా రెండోసారి నాలుగో స్థానం
- పెట్టుబడికి అనుకూలం.. భద్రతకు భరోసా
- అగ్రస్థానంలో కర్ణాటక, అడుగున బీహార్
- ఇన్నోవేషన్ ఇండెక్స్-2020 నివేదికవిడుదల చేసిన నీతిఆయోగ్
దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర అని మరోసారి రుజువైంది. అన్ని రంగాల్లో దేశానికి ఆయువుపట్టుగా ఉన్న ఐదారు పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని తాజా నివేదికలో నీతిఆయోగ్ స్పష్టంచేసింది. బుధవారం విడుదలచేసిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2020’లో తెలంగాణకు నాలుగోస్థానం దక్కింది. కర్ణాటక మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏడు అంశాల్లో కలిపి తెలంగాణ సగటున 33.23 స్కోర్ సాధించింది.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ, పారిశ్రామికరంగాలతోపాటు పలు ఇతర రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ నూతన ఆవిష్కరణల్లోనూ మరోసారి సత్తా చాటింది. దేశంలో కొత్త ఆవిష్కరణల్లో ముందున్న రాష్ర్టాలతో నీతి ఆయోగ్ విడుదలచేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో రాష్ట్రం వరుసగా రెండోసారి టాప్-5లో నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తరహాలో రూపొందించిన ఈ సూచీని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్ బుధవారం విడుదలచేశారు. 2019 సూచీలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2020 సూచీలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకొన్నది. ఈ సూచీలో కర్ణాటక వరుసగా రెండోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. మహారాష్ట్ర, తమిళనాడు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకొన్నాయి.
కేరళ ఐదో స్థానంలో.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ చివరి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానానికి పరిమితమైంది. టాప్-5లో మహారాష్ట్ర మినహా మిగిలిన రాష్ర్టాలన్నీ దక్షిణాదివే కావడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతాల క్యాటగిరీలో ఢిల్లీ.. ఈశాన్య, కొండ ప్రాంత రాష్ర్టాల క్యాటగిరీలో హిమాచల్‌ప్రదేశ్ ప్రథమ స్థానం సాధించాయి. ప్రధాన రాష్ర్టాల్లో సగటు ఇన్నోవేషన్ స్కోరు 25.35గా.. కర్ణాటక స్కోరు 42.5గా ఉన్నది. కేవలం 14.5 స్కోర్‌తో బీహార్ అట్టడుగున నిలిచింది. వెంచర్ క్యాపిటల్ ఒప్పందాలు, రిజిస్టర్డ్ జీఐలు (జియోగ్రాఫికల్ ఇండికేషన్లు), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఎగుమతులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగటం కర్ణాటకకు కలిసొచ్చాయని నీతి ఆయోగ్ వివరించింది. దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను.. ఆ దిశగా కృషి చేస్తున్న రాష్ర్టాలను గుర్తిస్తూ కేంద్రం ప్రతి సంవత్సరం ఈ జాబితాను విడుదల చేస్తున్నది. 2019లో విడుదలైన మొదటి ఇన్నోవేషన్ ఇండెక్స్‌లోనూ తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచింది. ఈసారి ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం.
ర్యాంకులు ఎలా కేటాయిస్తారంటే..
దేశ అభివృద్ధికి, సౌభాగ్యానికి ఆవిష్కరణలే ప్రధాన చోదకమని గుర్తించిన నీతి ఆయోగ్.. ఈ రంగంలో రాష్ర్టాల మధ్య పోటీని పెంపొందించేందుకు 2019 నుంచి ఈ సూచీని విడుదల చేస్తున్నది. ప్రజల విజ్ఞానం, నైపుణ్యం, పెట్టుబడులు, విజ్ఞానవంతులైన శ్రామికులు, వ్యాపార వాతావరణం, భద్రత-న్యాయ పరిస్థితులు అనే ఐదు అంశాలను విజ్ఞాన ఉత్పత్తి, విజ్ఞాన విస్తరణ అనే రెండు మూల స్తంభాలుగా విభజించి ఈ సూచీలో రాష్ర్టాలకు ఇచ్చే ర్యాంకులను లెక్కగడుతున్నది. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సన్నద్ధతను పెంపొందించుకోవడంలో రాష్ర్టాలకు ప్రాంతీయంగా ఉండే సానుకూలతలు, పరిమితులను ప్రముఖంగా ఆవిష్కరించే ఈ సూచీలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మూడు క్యాటగిరీలు (పెద్ద రాష్ర్టాలు, ఈశాన్య-కొండప్రాంత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు/నగర రాష్ర్టాలు/చిన్న రాష్ర్టాలు)గా విభజించి ర్యాంకులు కేటాయిస్తారు.
ఊహించినదానికన్నా మిన్నగా..
అనేక అంశాల్లో తెలంగాణ ఊహించినదానికన్న మిన్నగా ప్రదర్శన కనబరిచిందని నీతి ఆయోగ్ పేర్కొన్నది. ముఖ్యంగా పరిశోధనలపై దృష్టిపెట్టడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచానికి పరిచయం చేయడంలో (నాలెడ్జ్ డిఫ్యూజన్, నాలెడ్జ్ ఔట్పుట్) అంచనాలకు మించి స్కోర్ సాధించినట్టు వెల్లడించింది.
మూడు క్యాటగిరీలుగా రాష్ర్టాలు
భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా రాష్ర్టాలను మూడు క్యాటగిరీలుగా విభజించింది. ఆయా అంశాల్లో రాష్ర్టాల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు కేటాయించింది. పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఏడు అంశాల్లో కలిపి తెలంగాణ సగటున 33.23 స్కోర్ సాధించింది. పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడం, ఆవిష్కరణకు తగిన అవకాశాలు కల్పించడంలో (నాలెడ్జ్ ఔట్పుట్) తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. సగటు జీఎస్డీపీని రూ.1,43,618గా పేర్కొన్నది.
ఏడు అంశాల్లో పాయింట్లు
- హ్యూమన్ క్యాపిటల్: వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులు, విద్యాసంస్థల సామర్థ్యం, ప్రమాణాలు.
- ఇన్వెస్ట్మెంట్స్: విద్య, పరిశోధనలపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఖర్చు, రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు, ఎఫ్‌డీఐలు.
- నాలెడ్జ్ వర్కర్స్: నిపుణులైన కార్మికులు, శిక్షణ, ఎన్జీవోల భాగస్వామ్యం.
- బిజినెస్ ఎన్విరాన్మెంట్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడుల అనుకూల వాతావరణం, ఇంక్యుబేషన్ సెంటర్లు, ఆన్లైన్ సేవలు.
- సేఫ్టీ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్: ఐటీ చట్టాలు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, పెండింగ్ కేసుల సంఖ్య.
- నాలెడ్జ్ ఔట్పుట్: పేటెంట్లు, ట్రేడ్ మార్క్‌ల కోసం దరఖాస్తులు, స్టార్టప్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు.
- నాలెడ్జ్ డిఫ్యూజన్: ఐసీటీ ఎగుమతులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్లు.. రిజిస్ట్రేషన్లు, హై అండ్ మీడియం హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు.
తెలంగాణకు ఎందులో ఎంత స్కోర్?
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ | 92.86 |
ఉన్నత విద్యలో విద్యార్థులు-టీచర్ నిష్పత్తి | 87.76 |
నేషనల్ అచీవ్మెంట్ సర్వే | 87.21 |
మొత్తం ఏడు అంశాల్లో సగటు | 33.23 |