బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:56:51

జూన్‌ 8 నుంచి టెన్త్‌ పరీక్షలు !

జూన్‌ 8 నుంచి టెన్త్‌ పరీక్షలు !

 • పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి
 • ఏర్పాట్లు పూర్తిచేస్తున్న అధికారులు
 • ప్రతి పరీక్షకు రెండు రోజులు విరామం
 • ఒకటి రెండు రోజులలో టైంటేబుల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలపై ఉత్కంఠ తొలిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఎనిమిది పరీక్షలను జూన్‌ 8 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు పదో తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను నిలిపివేస్తూ మార్చి 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకొన్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జూన్‌ మూడున కరోనా పరిస్థితులను మరోసారి సమీక్షించుకొని పరీక్షలపై ముందుకెళ్లాలని సూచించింది. 

తప్పనిసరి అనుకొంటే వాయిదా వేయవచ్చని కూడా పేర్కొన్నది. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సామాన్యవిషయం కాదని, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని స్పష్టంచేసింది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన విద్యార్థులనుంచి తొలిగించాల్సిన అవసరమున్నదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో జూలైలో పరీక్షలు నిర్వహిస్తున్నారని, పరీక్షల సంఖ్యను కూడా కుదిస్తున్నారని.. అక్కడి విధానాలను ఇక్కడ కూడా అమలుచేయాలన్న వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. గణితం, సైన్స్‌ తదితర సబ్జెక్టులలో రెండు పేపర్లను ఒకటి చేయడం వల్ల విద్యార్థులపై భారం పెరుగుతుందని పేర్కొన్నది. పరీక్షల నిర్వహణకు పెద్ద క్యాంపస్‌ ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యమివ్వాలని, థర్మల్‌స్క్రీనింగ్‌ ఏర్పాటుచేయాలని సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలివ్వాలని ఆదేశించింది. అంతకుముందు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

8 నుంచి పరీక్షల నిర్వహణ

పదో తరగతికి సంబంధించి ఇప్పటికే రెండు పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో ఇంగ్లిష్‌, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు 2 పేపర్ల చొప్పున 8 ఉంటాయి. ప్రతి పరీక్షకు మధ్య 2 రోజుల విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారాలు కలుపుకుంటే 3 పరీక్షలకు 3 రోజులు విరామం వస్తుంది. మిగిలిన 5 పరీక్షలకు 2 రోజులు విరామం ఉంటుంది. ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలకు మరో ఆదివారం అదనంగా వస్తుంది. ఆదివారాలలో కూడా పరీక్షలు నిర్వహిస్తే, 8 ప్రధాన పరీక్షలు జూన్‌ 8 నుంచి 29 వరకు పూర్తవుతాయి. ఆదివారం సెలవుగా పరిగణిస్తే మరో 4 రోజులు అదనంగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుమేరకు ప్రతిపాదిత టైంటేబుల్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నామని ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. 

పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు 

 • ప్రతి పరీక్ష కేంద్రంలో 100 నుంచి 120 విద్యార్థులే ఉంటారు.
 • పరీక్షాకేంద్రాలను 4,535కు పెంచారు. 
 • ప్రతి విద్యార్థికి మధ్య ఐదారడుగుల భౌతికదూరాన్ని పాటిస్తారు. 
 • 10 నుంచి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. 
 • బెంచికి ఒక విద్యార్థి మాత్రమే కూర్చొంటారు. అది కూడా జిగ్‌జాగ్‌ పద్ధతిలో కూర్చోబెడతారు. 
 • కొత్తగా ఏర్పాటైన కేంద్రాలు విద్యార్థులకు చూపించడంకోసం అదనంగా 26,422 మంది సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. 
 • అదనంగా ఏర్పాటుచేసిన 2,005 పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించారు. 
 • విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే బస్సుల్లోనూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తారు. విద్యార్థితోపాటు ఒకరికే పరీక్షాకేంద్రానికి వెళ్లేందుకు అనుమతిస్తారు. 
 • విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది మాస్కులు ధరించాలి. ప్రతి విద్యార్థికి థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తారు. జ్వరం, జలుబు ఉంటే ప్రత్యేక పరీక్ష గది ఏర్పాటుచేస్తారు. 

ప్రతిపాదిత టైంటేబుల్‌  

జూన్‌ 8 ఇంగ్లిష్‌ పేపర్‌ -1

జూన్‌ 11 ఇంగ్లిష్‌ పేపర్‌ -2

జూన్‌ 14 గణితం పేపర్‌-1

జూన్‌ 17 గణితం పేపర్‌-2

జూన్‌ 20 సామాన్యశాస్త్రం -1

జూన్‌ 23 సామాన్యశాస్త్రం-2

జూన్‌ 26 సాంఘికశాస్త్రం -1

జూన్‌ 29 సాంఘిక శాస్త్రం-2 

జూలై 2 ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌ -1

జూలై 5 ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌-2

జూలై 8 ఎస్సెసీ ఒకేషనల్‌ థియరీ


logo