ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Jul 12, 2020 , 02:55:30

డీఏసీఏకు ట్రంప్‌ ఎసరు

డీఏసీఏకు ట్రంప్‌ ఎసరు

  • ప్రతిభ ఆధారిత వలసకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ యోచన
  • ఆర్డర్‌ వస్తే ఎక్కువ నష్టపోయేది భారత సంతతి పిల్లలే

వాషింగ్టన్‌, జూలై 11: అమెరికాలోకి ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా చిన్నతనంలోనే వెళ్లి స్థిరపడిన విదేశీయులను వెళ్లగొట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఆస్ర్తాన్ని ప్రయోగించనున్నారు. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) చట్టాన్ని ట్రంప్‌ సర్కారు గతంలో రద్దుచేయగా, ఆ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేయనున్నట్టు ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ స్వయంగా చెప్పారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు డీఏసీఏ చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులతోపాటు వెళ్లిన వారి పిల్లలకు ఆ దేశంలో స్వేచ్ఛగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం లభించింది. అలా వెళ్లినవారు ప్రస్తుతం 7లక్షల మందివరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు, ఆసియాదేశాలవారే ఉన్నారు.   

లెఫ్ట్‌ భావజాలాన్ని బోధిస్తున్నారు

విద్యాలయాలను తిరిగి తెరిపించేలా ఒత్తిడి పెంచడంలో భాగంగా ట్రంప్‌ మరోసారి వాటి ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకున్నారు. ‘చాలా యూనివర్సిటీలు, కాలేజీలు విద్యకు బదులుగా రాడికల్‌ లెఫ్ట్‌ భావజాలాన్ని బోధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి కల్పిస్తున్న పన్ను రాయితీలు, అందిస్తున్న నిధులపై పునఃసమీక్షించాలని ట్రెజరీ విభాగాన్ని ఆదేశిస్తున్నా’ అని ఆయన హెచ్చరించారు.


logo