బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 03:12:56

సమన్వయంతో పనిచేయండి

సమన్వయంతో పనిచేయండి
  • పెండింగ్‌ పనులు వేగంగా పూర్తికావాలి
  • వివిధశాఖల అధికారులతో మంత్రి కేటీఆర్‌
  • హైదరాబాద్‌లో ఆకస్మిక పర్యటన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వివిధశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సోమవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. తెలంగాణభవన్‌లో పార్టీ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న అనంతరం మంత్రి కేటీఆర్‌ నేరుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45కు చేరుకొని ఫ్లైఓవర్‌ నిర్మాణపనులను పరిశీలించారు. అనంతరం దుర్గంచెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను చూశారు. సుమారు గంటన్నరపాటు సాగిన పర్యటనలో అధికారులకు పలు సూచనలు చేశారు. వర్కింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులు తొందరగా పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధశాఖల మధ్య సమన్వయంపై అధికారులతో చర్చించారు. 


ట్రాన్స్‌కో విద్యుత్‌లైన్ల తొలగింపు, నూతన విద్యుత్‌టవర్ల నిర్మాణం వంటి పెండింగ్‌ పనులపై విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడారు. పనులకు అడ్డంకిగా ఉన్న లైన్లను రెండువారాల్లోగా తరలిస్తామని ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయిందని.. సుందరీకరణ, లైటింగ్‌, పాదచారుల బాటల పనులు చేపట్టినట్టు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక దానికి అనుసంధానంగా రోడ్‌ నంబర్‌ 45వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను వేగంగా పూర్తిచేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపూర్తయితే పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ చాలావరకు తగ్గుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్లతో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జితో హైదరాబాద్‌కు మరింత గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo