గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 18:47:48

ఈసారి తప్పకుండా సెంచరీ కొడతాం: మంత్రి కేటీఆర్‌

ఈసారి తప్పకుండా సెంచరీ కొడతాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్:‌ గత  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  సెంచరీ మిస్సయ్యామని, ఈసారి తప్పకుండా శతకం సాధిస్తామని  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలిపారు.  తెలంగాణ భవన్‌లో  జీహెచ్‌ఎంసీ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో   కేటీఆర్‌ సమావేశమయ్యారు.  ఎన్నికల కమిషన్‌ తక్కువ సమయం ఇచ్చింది ఎక్కువ కష్టపడండి. అని అభ్యర్థులకు  సూచించారు. 

'ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది.  గత ఎన్నికల్లో  ఒక్క బాల్‌ కొడితే సెంచరీ అయ్యేది.  జాంభాగ్‌లో 5 ఓట్లతో ఓడిపోయాం. ఈసారి సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నాం.  ప్రజల ఆశీర్వాదం  టీఆర్‌ఎస్‌ పార్టీకి  ఉందని' కేటీఆర్‌ పేర్కొన్నారు. 

'హైదరాబాద్‌కు ఏం చేస్తరో బీజేపీ నేతలు చెప్పాలి.  ఎక్కడ ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో చెప్పండి. ఇన్ని అభివృద్ధి పనులు చేసినా ఎలాంటి పన్నులు పెంచలేదు.  ప్రాపర్టీ ట్యాక్స్‌ 50శాతం తగ్గించాం.  లాక్‌డౌన్‌లో ఇంటింటికీ రూ.1500  సాయం చేశాం.  నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు గళమెత్తుతున్నారని' మంత్రి తెలిపారు. 

'టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను కలిసి మద్దతు కోరాలి.  ఎల్‌ఐసీ, రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించండి.  ప్రతీ వర్గం ఆశీస్సులను తీసుకోవాలి.  హైదరాబాద్‌లో అంతా బాగుంది కాబట్టే  ప్రముఖ కంపెనీలు అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌  సంస్థలు ఇక్కడికి వచ్చాయని' మంత్రి పేర్కొన్నారు.