శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 18:24:32

ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదు: మంత్రి కేటీఆర్‌

ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడగాలని    టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్‌  సూచించారు.  'హైదరాబాద్‌లో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంది. ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్ల సాయం అందించాం.  రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.  ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదని' కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో  హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రగతి నివేదికను విడుదల చేసిన అనంతరం కేటీఆర్‌  మాట్లాడారు. 

'రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి.  హైదరాబాద్‌లో రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్‌ బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుంది.  రెండు అంశాల గురించి ఆలోచించాలని హైదరాబాద్‌ ప్రజలకు చెప్పాలి.  అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌ కావాలా?. నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్‌ కావాలా?. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన పనులు వంద చెప్పవచ్చు.  కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన ఒక్కపని చూపెడతారా?  ఆరేళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి హైదరాబాదా? లేక అశాంతి హైదరాబాదా? ప్రజలు తేల్చుకోవాలి.  ఎలాంటి హైదరాబాద్‌ కావాలో ప్రజలే నిర్ణయించాలి'. అని  అన్నారు. 

'350 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం.  గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.  జీవో నెంబర్‌ 58, 59 కింద లక్ష పట్టాలు పంపిణీ చేశాం.  వరదతో ఇబ్బంది పడ్డా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. హైదరాబాద్‌లో మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు నిర్మించాం.  137 కొత్త లింకు రోడ్లు నిర్మిస్తున్నాం. అవసరమైన చోట ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని' మంత్రి చెప్పారు.