మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 17:47:08

ఇది అందరి హైదరాబాద్‌..అందరికోసం పనిచేసే ప్రభుత్వం: మంత్రి కేటీఆర్‌

ఇది అందరి హైదరాబాద్‌..అందరికోసం పనిచేసే ప్రభుత్వం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని,  అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశామని  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో  జీహెచ్‌ఎంసీ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో   కేటీఆర్‌ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా  హైదరాబాద్‌ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రగతి నివేదికను విడుదల చేశారు. 

'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో   85 డివిజన్లలో  మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించాం.   ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు.  50శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాం. అగ్రవర్ణాల వారికి కూడా న్యాయం చేశాం.   ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని' కేటీఆర్‌ పేర్కొన్నారు.

'మాటల్లో కాదు..చేతల్లో సామాజిక న్యాయం చూపిన పార్టీ టీఆర్‌ఎస్‌.  ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారికి 8 సీట్లు కేటాయించాం. తెలంగాణకు బతుకుదెరువుకు వచ్చిన వారంతా మా బిడ్డలే అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.   గులాబీ సైనికులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో కార్యకర్త 50వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వందల మంది కష్టపడితే ఒక్క నాయకుడు వస్తాడు.  అభ్యర్థులు టికెట్‌ రాని నేతలను కలుపుకొని పోవాలి.  ఇది అందరి హైదరాబాద్‌..అందరికోసం పనిచేసే ప్రభుత్వం. అభ్యర్థులు రేపే బీఫారాలు సమర్పించాలని' కేటీఆర్‌ సూచించారు.