మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 00:18:04

శ్రావణంలో ముహూర్తం!

శ్రావణంలో ముహూర్తం!

  • 25 తర్వాత టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు ప్రారంభం
  • ప్రారంభించనున్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయ భవనాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. శ్రావణ మాస శుభగడియల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వీటిని ప్రారంభించనున్నారు. ఈ నెల 21నుంచి శ్రావణం మాసం ప్రారంభంకానున్నది. జిల్లాకేంద్రాల్లో నిర్మించిన పార్టీ కార్యాలయాలను ఈ నెల 25 తరువాత దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ప్రారంభిస్తారు. ఇందుకోసం సిద్ధంచేయాలని నాయకులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తుండగా, వీటిలో సగంవరకు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీకి శాశ్వత కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో ఎకరం స్థలంలో వీటిని నిర్మిస్తున్నారు. వీటికి అవసరమైన భూమిని ప్రభుత్వం నుంచి కొన్నారు. ఒక్కో కార్యాలయం నిర్మాణానికి రూ.60 లక్షలను పార్టీనుంచి చెల్లించారు. చెక్కులను స్వయంగా కేసీఆరే ఆయా జిల్లాల బాధ్యులకు అందించారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలు ఒకే నమునాలో ఉండేలా డిజైన్‌ చేయించి పార్టీ నాయకులకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. 1000-1500 మంది కూర్చునేలా సమావేశం మందిరాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మీడియా సమావేశాలు, నియోజకవర్గస్థాయి ముఖ్యులతో సమావేశాలు జరుపుకునేలా మరో భవనాన్ని డిజైన్‌ చేశారు. వీటన్నింటికి తెలంగాణ భవన్‌ అని పేరు పెట్టారు.

వర్షాలు, లాక్‌డౌన్‌తో జాప్యం

గత దసరా నాటికే నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వరుసగా వర్షాలు పడటంతో నిర్మాణాల్లో జాప్యమైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఆపై కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభమై పనులు మళ్లీ నిలిచిపోయాయి. పార్టీ కార్యాలయాలను ప్రారంభానికి సిద్ధంచేయాలని, కరోనా నేపథ్యంలో ప్రారంభోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. ఇప్పటికే సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, యాదాద్రిభువనగిరి, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, జయశంకర్‌భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, ములుగు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నది. వరంగల్‌ రూరల్‌, హైదరాబాద్‌ జిల్లాలో స్థలాలను సేకరించాల్సి ఉన్నది. మిగిలిన జిల్లాల కార్యాలయాలు తుదిదశకు చేరుకున్నాయి.logo