సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 27, 2020 , 02:09:43

మన తెలంగాణ దేశానికే నమూనా

మన తెలంగాణ దేశానికే నమూనా

 • జల దృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా
 • ఇదీ టీఆర్‌ఎస్‌ ప్రస్థానం
 • స్వీయ అస్తిత్వమే తెలంగాణ రాష్ర్టానికి రక్ష
 • నాడు వ్యతిరేకించినవారు సైతం నేడు ముఖ్యమంత్రిని కొనియాడుతున్నారు
 • కేసీఆర్‌పై ప్రజలకు ఎనలేని నమ్మకం
 • మరో 15-20 ఏండ్లు ఆయనే ముఖ్యమంత్రి
 • గెలుపు టీఆర్‌ఎస్‌కు సహజంగా మారింది
 • రాష్ట్రంలో 5 విప్లవాలు రాబోతున్నాయి
 • జల, హరిత, నీలి, క్షీర, గులాబీ విప్లవాలు
 • కేసీఆర్‌ కాకుండా మరొకరు వచ్చిఉంటే తెలంగాణలో ఇవన్నీ సాధ్యమయ్యేవా?
 • నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కే తారకరామారావు అన్నారు. తెలంగాణ సాధనతో పాటు పరిపాలనలో సైతం పరివర్తనం చెంది.. అధికార పార్టీగా ప్రజల మన్ననలను పొందిన టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల ప్రస్థానంలో అనేక విజయాలను సాధించడం అద్భుతం, అపూర్వమని అన్నారు. కరోనా తరువాత దేశానికి , రాష్ర్టానికి కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇరవై ఏండ్ల ప్రస్థానంపై కేటీఆర్‌ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ విధానం, ప్రభుత్వ ఆశయాలను  ఉదహరిస్తూ భవిష్యత్‌ లక్ష్యాలను వివరించారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో జలదృశ్యం నుంచి ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ఈరోజు తెలంగాణలో సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని సీఎం కేసీఆర్‌ ఆచరణలో అమలుచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఐదు విప్లవాలు రాబోతున్నాయని వెల్లడించారు. త్వరలోనే పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించి కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని, మరో 15-20 ఏండ్లు సీఎంగా కేసీఆర్‌ ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. కేటీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

మంచి ఉద్యమకారుడు.. పరిపాలనాదక్షుడు

ఒక మంచి ఉద్యమకారుడు.. పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకోవడం చాలా కష్టమని.. కేసీఆర్‌లో ఆ రెండింటిని చూశానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్‌జైట్లీ తనతో అన్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాన్ని సాధించడమే కాకుండా సాధించిన ప్రయోజనానికి తానే నాయకత్వం వహించి, తాను ఏమైతే చెప్పారో దాన్ని సాధించే అవకాశం మీకే దక్కిందని కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారని చెప్పారు. ప్రణబ్‌ ఆత్మకథలో కూడా.. కేసీఆర్‌ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడూ సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో పోరాడారని పేర్కొన్నట్టు వివరించారు. ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ప్రొఫెసర్‌ జయశంకర్‌, ఆర్‌ విద్యాసాగర్‌రావు లాంటి మహానుభావులు ఎందరో కలిసిరావడం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. 

ఎన్నికల్లో గెలుపు సహజ విషయం 

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఏదైనా ఎన్నికల్లో విజయం సాధిస్తే అది సహజ విషయంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. అన్ని స్థానిక ఎన్నికల్లో గెలుపుతో అద్భుతమైన రాజకీయశక్తిగా మారిందని చెప్పారు. ఈరోజు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల బలంతోనే టీఆర్‌ఎస్‌ ఈ స్థాయికి చేరుకున్నదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాలకుపైగా మనగలిగిన రాజకీయ పార్టీలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చన్నారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయపార్టీలు అనే వ్యత్యాసం లేకుండాపోయిందన్నారు. ప్రజాజీవితంలో ఉండి, ఇన్ని పర్యాయాలు ప్రజల ఆదరణ పొందింది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ అజేయమైన శక్తిగా ఉండటానికి ప్రజలు,  పార్టీ శ్రేణులే కారణం. వారికి  వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న. పాదాభివందనం చేస్తున్న’ అని చెప్పారు.  

స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్తుండేవారని, ఇప్పుడు కనిపిస్తున్న మార్పులు చూస్తుంటే గర్వంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రేడియోల్లో, టీవీ వార్తల్లో, సినిమాల్లో తెలంగాణ భాషలో ధారాళంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకప్పుడు సినిమాలో జోకర్లకు మాత్రమే వాడిన తెలంగాణ భాష ఇవాళ ప్రధాన స్రవంతిలో భాగమైందన్నారు. పట్టణాల్లో చూస్తే పరిశ్రమలు, ఐటీ రంగంలో, ఈవోడీబీ, టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌బీపాస్‌లతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కేటీఆర్‌ అన్నారు. 


నీళ్లు, నిధులు, నియామకాలు నిజమవుతున్నాయి

ఉద్యమం మొదటిరోజే నీళ్లు, నిధులు, నియామకాలే తమ ప్రధాన నినాదమని కేసీఆర్‌ చెప్పారని.. ఇప్పుడు ఆ మూడూ సాక్షాత్కరిస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడితే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ మాటల్లో విశ్వాసం, విషయ పరిజ్ఞానం, విషయాన్ని ఆకళింపు చేసుకొనే పద్ధతికానీ ప్రపంచంలోని తెలుగువారందరినీ టీవీలకు హత్తుకుపోయేలా చేస్తాయని చెప్పారు. ‘కేసీఆర్‌ ఏది చెప్తే అది చేస్తున్నారు. చికెన్‌ తినాలంటే తింటున్నారు. బత్తాయిలు తినాలంటే తింటున్నారు. ఆయన పట్ల, కేసీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజలకు అంత విశ్వాసం ఉన్నది’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.   

ఎక్కడైనా ఇంతగనం గెలిచారా?

‘దేశంలో జెడ్పీ ఎన్నికల్లో 32కు 32 గెలిచిన పార్టీ ఏదైనా ఉన్నదా, మున్సిపాలిటీల్లో 94శాతం గెలిచాం, 133లో 122 చైర్మన్లను గెలుచుకున్నాం. ఈ విజయాలకు ప్రధాన కారణం కేసీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజల్లో కుదిరిన విశ్వాసమే. క్షేత్రస్థాయిలో కనపడుతున్న ఫలితాలే’ అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.   

ఇంటిమీదే జెండా ఎగురేయండి

‘టీఆర్‌ఎస్‌  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కార్యకర్తలు గులాబీ జెండాను ఇండ్లపైనే ఎగురవేయండి. సంఘీభావ సంకేతాన్ని తెలియజేయండి. సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇవ్వండి. పేదలకు సామాజిక కార్యక్రమాలు చేయాలి. సమూహాలుగా పోకూడదు’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

త్వరలో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు

అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్‌ చెప్పారు. అన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఉగాదికే ప్రారంభించాలనుకున్నప్పటికీ కరోనా వల్ల ఆగిపోయాయన్నారు. ప్రారంభించాక కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా మని, తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా పాలన సాగుతు న్నదని చెప్పారు. ప్రజలకు స్వీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ స్థానంలో ఏ పార్టీ ఉన్నా.. కేసీఆర్‌ కాక ఎవరు సీఎం అయినా.. ఇన్ని విజయాలు నమోదయ్యేవా ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

దేశానికి తెలంగాణ మోడల్‌

జాతీయస్థాయిలో గతంలో బెంగాల్‌, గుజరాత్‌ మోడల్‌ అంటూ అందరూ చెప్పుకొనేవాళ్లని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో తెలంగాణ మోడల్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని కేటీఆర్‌ చెప్పారు. దేశానికే ఆదర్శవంతమైన కొత్త మోడల్‌ను  తెలంగాణ ఆవిష్కరించబోతున్నద న్నారు. అన్ని రంగాలపై ఈ దేశంలో ఏ నాయకుడికి లేని పట్టు సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని చెప్పారు. పట్టుదల, కఠోరశ్రమ, ఉద్యమ అనుభవాల వల్లే సీఎం కేసీఆర్‌ ముందుకు సాగిపోతున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

ఐదు విప్లవాలు రాబోతున్నాయి 

తెలంగాణలో మన కండ్లముందే ఐదు విప్లవా లు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అన్ని విప్లవాలకు పునాది జలవిప్లవమన్నారు. ఈ ఐదు విప్లవాలు తెలంగాణ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాయని చెప్పారు. లక్షల మం ది ఉపాధి పొందుతారన్నారు. తెలంగాణ ఐదారు రాష్ట్రాలకు ధాన్యాన్ని సరఫరా చేయబోతున్నదని ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ ప్రశంసించిన విషయా న్ని గుర్తుచేశారు. దేశం మొత్తానికి బువ్వపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. 

మొదటిది జల విప్లవం: గతంలో సాగునీటి ప్రాజెక్టు అంటే దశాబ్దాలపాటు కట్టాలనేది సంప్రదాయంగా ఉండేది. ఎస్సారెస్పీకి యాభై ఏండ్లు పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని మూడేండ్లలో పూర్తిచేయగలిగారు. 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్లు ఉండే కొండపోచమ్మసాగర్‌ దగ్గరికి పదిరోజుల్లో నీళ్లు రాబోతున్నాయి. ఇది అద్భుతమైన ఆవిష్కరణ. అనన్య సామాన్య విషయం. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణలో జలవిప్లవానికి ఆయన నాంది పలికారు.  

రెండోది హరిత విప్లవం: రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం కాబోతున్నది. దాశరథి అప్పుడెప్పుడో నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణంచేశారు. ప్రజలకు శాశ్వతకానుకగా వారిచేతుల్లో పెట్టబోతున్నారు.

మూడోది నీలి విప్లవం (బ్లూ రెవల్యూషన్‌): అక్వా కల్చర్‌, ఫిష్‌ కల్చర్‌ రాబోతున్నది. 46వేల చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో  గోదావరి, కృష్ణా నీళ్లతో ప్రాజెక్టులు పూర్తి అయి సస్యశ్యామలం అయి కొత్త దృశ్యం ఆవిష్కరించబోతున్నది. 

నాలుగోది క్షీర విప్లవం: విజయ డెయిరీ ద్వారా నాలుగు రూపాయల ఇన్సెంటివ్‌ వచ్చిన తర్వాత గతంలో నష్టాల్లో ఉన్న డెయిరీ ఇప్పుడు ప్రభుత్వానికి డివిడెండ్‌ ఇచ్చే స్థాయికి వచ్చింది.

ఐదోది పింక్‌ రెవల్యూషన్‌: గొర్రెల పెంపకం పథకం ద్వారా మాంసం ఉత్పత్తి పెరిగి పింక్‌ రెవల్యూషన్‌ రాబోతుంది. గొర్రెల పెంపకం, పౌల్ట్రీ ఉత్పత్తి ద్వారా పింక్‌ విప్లవం రాబోతున్నది. తెలంగాణ ఇప్పటికే పౌల్ట్రీకి రాజధాని.


దేశంలో గతంలో బెంగాల్‌, గుజరాత్‌ మోడల్‌ ఉండేది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ నమూనాను ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది.

- టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , కే తారకరామారావు


logo