మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 13:28:40

మ‌తం, దేశ‌భ‌క్తి ప్ర‌చారాస్ర్తాలు కావొద్దు : కేటీఆర్

మ‌తం, దేశ‌భ‌క్తి ప్ర‌చారాస్ర్తాలు కావొద్దు : కేటీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కొంద‌రు‌ మ‌తం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మ‌ట్టిలో ప‌ర‌మ‌త స‌హ‌నం ఉంది. విద్వేష‌పు విత్త‌నాల‌కు తెలంగాణ‌లో స్థానం లేదు. విద్వేషాల‌ను రెచ్చ‌గొడితే ప్ర‌జ‌లే బుద్ధి చెప్తారు. ఎవ‌రి ధ‌ర్మాన్ని వారు ఆచ‌రిస్తారు. కానీ ఒక‌రిని చిన్న‌గా చేసి చూపించ‌కూడ‌దు. అలా చేయ‌డం మంచిది కాదు. మ‌తం ప్ర‌చార అస్ర్తం కాదు.. దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న అస్ర్తమూ కాదు.. దేశ‌భ‌క్తి మ‌న‌కే ఎక్కువ ఉంది అని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీలో రావుల‌ శ్రీధ‌ర్ రెడ్డి చేరిక సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టంలో అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోయాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల‌కు ఏమీ స‌మ‌స్య‌లు క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో.. మ‌తం, కులం పేరిట విధ్వంస‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేందుకు కుట్ర చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిని అంద‌రూ గుర్తించాల‌న్నారు. కేసీఆర్ మీద తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపార‌మైన విశ్వాసం ఉంద‌న్నారు. తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలుపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సోష‌ల్ మీడియాలో ఎన్ని విన్యాసాలు చేసినా బీజేపీ ఆట‌లు సాగవు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

కేసీఆర్ నాయ‌క‌త్వం రాష్ర్టానికి శ్రీరామ‌ర‌క్ష‌

తెలంగాణ రాష్ర్టానికి అండ‌గా ఉండే పార్టీ టీఆర్ఎస్ మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ నాయ‌క‌త్వం తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామ‌ర‌క్ష అనేది అక్ష‌ర స‌త్యం అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నో ఎజెండాలు ఉంటాయి. కానీ కేసీఆర్‌కు ఉన్న‌ది ఒకే ఎజెండా.. అది తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే. ఈ ఆరేళ్ల‌లో ఎక్క‌డ ఏ ఎన్నిక వ‌చ్చినా.. కేసీఆర్ నాయ‌క‌త్వానికే జై కొడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు క‌ళ్లు తెరుచుకోవ‌డం లేదు. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్ర‌త్యామ్నాయం అని అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీ ప్ర‌చారం చేసింది. ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కూడా అదే ధోర‌ణిని అవ‌లంభిస్తోంది అని కేటీఆర్ అన్నారు. 

తీసుకోవ‌డమే త‌ప్ప ఇవ్వ‌డం లేదు

ఈ ఆరేండ్ల‌లో కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ.‌ 2 ల‌క్ష‌ల 72 వేల కోట్లు ఇచ్చింద‌ని తెలిపారు. కేంద్రం మాత్రం ఒక ల‌‌క్ష 40 వేల 329 కోట్లు మాత్ర‌మే ఇచ్చింద‌ని పేర్కొన్నారు. రాష్ర్టం నుంచి తీసుకోవ‌డ‌మే త‌ప్ప ఢిల్లీ నుంచి ఏమీ ఇవ్వ‌డం లేదు. కానీ మాట‌లేమో మొత్తం తామే ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. బీజేపీ నాయ‌కుల ఇండ్ల‌లో పైస‌లు దొరికితే అవి త‌మ‌వి కావు అని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

రైతుల‌ను చావుదెబ్బ కొట్టేందుకు య‌త్నం

రాష్ర్ట రైతాంగానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదు. నోట్ల ర‌ద్దుతో ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో.. ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత కుదేలయింది. ఆర్థిక వ్య‌వ‌స్థ విష‌యంలో  ప్ర‌పంచం ముందు దేశం త‌ల‌దించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  న‌ల్ల‌ధ‌నం తెస్తామ‌ని చెప్పి.. న‌ల్ల చ‌ట్టాలు తీసుకొచ్చారు. అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులు, విద్యుత్ చ‌ట్టాన్ని తీసుకొచ్చి రైతుల‌ను చావుదెబ్బ కొట్టే చ‌ట్టాలు తీసుకువ‌చ్చారు. రైతులు వ‌ద్దు.. కార్పొరేట్లు ముద్దు అన్న ‌చందంగా కేంద్రం వ్య‌వ‌హరిస్తోంద‌న్నారు. బీజేపీకి అన్ని వ‌ర్గాలు దూర‌మ‌వుతున్నాయి. ఒంటెద్దు పోక‌డ‌ల‌తో మిత్ర ప‌క్షాల‌న్నీ దూర‌మ‌య్యాయి. కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడి కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.