మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:02:43

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

  • కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు 
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • ఆత్మహత్య చేసుకొన్న కార్యకర్త స్వామి పాడె మోసిన మంత్రి 
  • బాధిత కుటుంబానికిరూ.2 లక్షల ఆర్థిక సాయం 

దుబ్బాక: రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో సోలిపేట సుజాత ఓటమిని తట్టుకోలేక సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కొత్తింటి స్వామి(34) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి గ్రామానికి  వెళ్లి స్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ పక్షాన సంతాపం తెలిపారు. స్వామి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఎంతో భవిష్యత్తు ఉన్నదనీ, ఎన్నో ఎన్నికల్లో గెలిచామన్నారు. కొన్ని సందర్భాల్లో ఓటమిని కూడా అంగీకరించాల్సి ఉంటుందన్నారు. గెలిచినప్పుడు పొంగిపోవడం.. ఓడినప్పుడు కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. అనంతరం స్వామి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.  

మానవత్వాన్ని చాటిన మంత్రి హరీశ్‌రావు 

వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను దగ్గరుండి దవాఖానకు తరలించి మంత్రి హరీశ్‌రావు మానవత్వం చాటుకొన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి దౌల్తాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండ గా మాసాయిపేట సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ ప్రమాదానికి గురైన యువకులను చూసి మంత్రి వాహ నం ఆపి పరామర్శించారు. క్షతగాత్రులను దగ్గరుండి దవాఖానకు తరలించిన మంత్రి.. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఎస్సైని ఆదేశించారు.