శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 01:56:05

వరుసగా రెండోసారి!

వరుసగా రెండోసారి!

 • అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌
 • 2016 వరకు బల్దియాలో అస్థిరపాలనే
 • స్థిరమైన పాలన అందించిన గులాబీదళం
 • మరోసారి పీఠం అధిష్ఠించేందుకు సిద్ధం

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:బల్దియా చరిత్రలో 2016 వరకు ఏఒక్క పార్టీ ఒంటరిగా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. కానీ ఆ చరిత్రను 2016లో తిరగరాసిన అధికార టీఆర్‌ఎస్‌.. రెండో దఫాగా తాజా ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన బల్దియా పోరులో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. దీనితో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ప్రకారం ఎక్స్‌ అఫీషియోలతో కలుపుకొని అధిక సభ్యుల మద్దతు ఉన్న పార్టీ కావడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకోవడం నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 

గతమంతా అస్థిరపాలనే

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటయిన కాలం నుంచి 2016 వరకు అస్థిర పాలనే కొనసాగింది. సుమారు దశాబ్ద కాలంలో ఎవరూ దీర్ఘకాలంలో మేయర్‌ పదవిలో కొనసాగిన దాఖలాల్లేవు. దీంతో నగరాభివృద్ధి కుంటుపడింది. ఎప్పుడూ రాజకీయ పంపకాల్లో భాగంగా మేయర్‌ పదవి వివాదాస్పదంగా నిలుస్తూ వచ్చింది. 

మధ్యలోనే వైదొలిగిన తొలి మేయర్‌

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1955లో ఏర్పడింది. అంతకు ముందు వరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఉండేవి. 1955 నాటికి సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు హైదరాబాద్‌లో విలీనమయ్యాయి.  1962-63లో రాణి కుముదినిదేవి తొలి మహిళా మేయర్‌గా పదవి చేపట్టారు. కానీ ఆమెను మధ్యలోనే పదవి నుంచి తప్పించారు. 

 • 1965-66 మధ్య సామాజిక వేత్త సరోజినీ పుల్లారెడ్డి నగర మేయర్‌గా పనిచేశారు. 1967లో ఆమె ఎమ్మెల్యేగా గెలువటంతో మేయర్‌ పదవిని వదులుకున్నారు.
 • 1952 నుంచి 1970 వరకు మేయర్‌గా పని చేసినవారందరూ ఏడాది నుంచి మూడేండ్లకు మించి పదవిలో కొనసాగలేదు. 
 • 1970 నుంచి 1986 వరకు 16 ఏండ్లు కార్పొరేషన్‌కు ఎన్నికలే నిర్వహించలేదు. 
 • 1991 నుంచి 2002 వరకూ అదే పరిస్థితి.
 •  2002 నుంచి 2007 వరకు తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ఉన్నారు. డైరెక్ట్‌ ఎలక్షన్‌లో ఆయన మేయర్‌ పీఠాన్ని అధిష్ఠించారు.
 • 2007లో మరో 12 సబర్బన్‌ మున్సిపాలిటీలను కలుపుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)గా ఏర్పడింది. 2007 నుంచి 2009 వరకు ప్రత్యేక పాలనే కొనసాగింది. 
 • 2009లో జీహెచ్‌ఎంసీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి మేయర్‌ బండ కార్తీకరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కానీ కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ లేకపోవటంతో ఎంఐఎంతో పొత్తులో భాగంగా రెండున్నరేండ్లు మాత్రమే ఆమె పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రెండేండ్లు మజ్లిస్‌ కార్పొరేటర్‌ మాజిద్‌ హుస్సేన్‌ మేయర్‌ పదవిలో ఉన్నారు.


logo