బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 03:02:25

రైతన్న కోసం గళంరాజ్యసభలో రణం

రైతన్న కోసం గళంరాజ్యసభలో రణం

  • కేంద్రంపై పోరులో టీఆర్‌ఎస్‌ దూకుడు
  • మోదీ సర్కారు దుడుకుతనంపై ధ్వజం
  • ముందుండి కదంతొక్కిన మన ఎంపీలు
  • కేంద్రంపై టీఆర్‌ఎస్‌ రణం 
  • రైతు వ్యతిరేక చర్యలపై ముందుండి పోరు 
  • రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై ధ్వజం 
  • ప్రతిపక్షాలను ఒక్కటి చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20: సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ దూకుడుగా పోరాడుతున్నది. టీం ఇండియా స్ఫూర్తి అంటూ నీతులు వళ్లిస్తూనే రాష్ర్టాలకు గోతులు తవ్వుతున్న మోదీ సర్కారుపై పార్లమెంటు లోపల, బయట టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముందుండి పోరాతున్నారు. మొన్నటికి మొన్న జీఎస్టీ పరిహారంపై టీఆర్‌ఎస్‌ గట్టిగా నిలదీయటంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు చూపిన దారిలో అనేక రాష్ర్టాలు జీఎస్టీ పరిహారం కోసం గళమెత్తాయి. తాజాగా రాజ్యసభ సాక్షిగా రైతు వ్యతిరేక విధానాలపై కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ సభ్యులు కడిగి పారేశారు. రైతులకు ఉరి వేసేలా ఉన్న వ్యవసాయ సంస్కరణల బిల్లులను ఉపసంహరించుకోవాలని సభను స్తంభింపజేశారు. 

ఆందోళనలో అన్నీ తామై.. 

వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల పేరుతో మోదీ సర్కారు రైతాంగానికి చేస్తున్న ద్రోహంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు మొదటినుంచీ పోరాడుతూనే ఉన్నారు. ఈ బిల్లులను అడ్డుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌ తదితరులు విపక్ష ఎంపీలను అందుకు ముందుగానే సమాయత్తం చేశారు. దాంతో బిల్లులను ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టగానే టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిపై రాష్ట్రప్రభుత్వాల, రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి వెళ్లి బిల్లులను ఉపసంహరించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. అందుకోసం బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల డిమాండ్‌కు విపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చి మద్దతు పలికాయి. మొన్నటిదాకా నిర్లిప్తంగా ఉన్న కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు టీఆర్‌ఎస్‌ సభ్యుల దూకుడుతో ఆదివారం గట్టిగా పోరాడాయి. సభలో కేకే సంధించిన ఏ ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రాలేదు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసానికి నేతృత్వం 

రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌పై అవిశ్వాస నోటీసులు ఇవ్వటంలో ఇతర విపక్షాలకు టీఆర్‌ఎస్‌ ఎంపీలే నాయకత్వం వహించారు. సభ వాయిదా పడిన తర్వాత అక్కడే ఆందోళన చేస్తున్న విపక్షాలను సమావేశపర్చి అవిశ్వాస నోటీసుపై చర్చించారు. బలప్రదర్శనతో ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న మోదీ సర్కారును అడ్డుకొని తీరాలని సూచించారు. దాంతో విపక్ష పార్టీలు అవిశ్వాస నోటీసు ఇవ్వటానికి ముందుకొచ్చాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటాన్ని ప్రతిపక్ష సభ్యులంతా ప్రశంసించారు. 



logo