గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 26, 2020 , 01:56:57

టీఆర్‌ఎస్‌ మరింత బలోపేతం

టీఆర్‌ఎస్‌ మరింత బలోపేతం
  • వార్డునుంచి రాష్ట్రస్థాయివరకు పటిష్ఠంగా క్యాడర్‌
  • ఏ పార్టీకీ లేనివిధంగా 60 లక్షల సభ్యత్వాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలోపేతమైంది. ప్రతి వార్డు నుంచి రాష్ట్రస్థాయి వరకు క్యాడర్‌ను పటిష్ఠంచేసుకున్నది. ఒక వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు పార్టీ శ్రేణులను కలిగిన పార్టీగా రూపాంతరం చెందింది. 2001 ఏప్రిల్‌ 27న  తన ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ శక్తిని పెంచుకుంటూ ఎదురులేని రాజకీయ పార్టీగా ఎదిగింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతున్నది. ఏ పార్టీకైనా క్యాడర్‌ ప్రధానం. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజిల్లా, మండలం, గ్రామం, తం డాల్లో పార్టీ సభ్యుడు ఉండేలా 60 లక్షల సభ్యత్వాలు ఇచ్చింది. గ్రామ, మండల కమిటీలను, బూత్‌ కమిటీలను సైతం నియమించారు.


గత ఏడాది గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపిన సర్పంచ్‌, వార్డు సభ్యులు అత్యధిక సంఖ్యలో గెలిచారు. 12 వేల గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగగా దాదాపు పది వేల వరకు సర్పంచ్‌లుగా పార్టీ మద్దతుదారులు గెలిచారు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో 80 శాతానికిపై స్థానాలను, 32 జెడ్పీ చైర్మన్లను పార్టీ గెలుచుకున్నది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు ఉన్నారు. చట్టసభలు, మరో వైపు స్థానిక సంస్థలు, సభ్యత్వం ఇలా అన్ని రకాలుగా పార్టీ పటిష్ఠంగా మారింది. హైదరాబాద్‌ నుంచి ఒక్క పిలుపు ఇస్తే ప్రతి గ్రామ, వార్డుస్థాయిలో స్పందించేలా టీఆర్‌ఎస్‌కు క్యాడర్‌ ఏర్పడింది. 


logo