కారుదే జోరు

- జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్దే విజయం
- ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠం
- 80 నుంచి 101 సీట్లు ఖాయమని వెల్లడి
- పోటీలో కూడా నిలవని కమలం పార్టీ
- టీఆర్ఎస్కే మొగ్గుచూపిన గ్రేటర్ ప్రజలు
- ఓట్లశాతంలోనూ గులాబీదే పైచేయి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలు.. కుతంత్రాలను హైదరాబాదీలు తిప్పికొట్టారని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు తేల్చాయి. అభివృద్ధే నినాదంగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్కే మరోసారి అధికారం కట్టబెట్టనున్నట్టు వెల్లడించాయి. టీఆర్ఎస్ ముందు నుంచీ చెప్తున్నట్టుగానే వంద డివిజన్లలో జయకేతనం ఎగురవేయటం ఖాయమని స్పష్టంచేశాయి. పదికిపైగా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ సర్వేల ఫలితాలను గురువారం విడుదల చేశాయి.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 1వ తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఖాయమని ఎగ్జిట్‌పోల్ సర్వేలు తేల్చాయి. బల్దియా పీఠం తమదేనంటూ లొల్లిలొల్లి చేసిన బీజేపీ కనీసం పోటీలో కూడా నిలువదని స్పష్టంచేశాయి. కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలన్నీ బేజారవటం ఖాయమని పేర్కొన్నాయి. అత్యంత శాస్త్రీయంగా పదికిపైగా సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ అటూ ఇటుగా టీఆర్ఎస్కు 80 నుంచి 101 స్థానాలు లభిస్తాయని తెలిపాయి. ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా గందరగోళానికి, ఉత్కంఠకు తావివ్వకుండా హైదరాబాదీలు టీఆర్ఎస్వైపే నిలబడ్డారని తేల్చి చెప్పాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి పోటీ నువ్వానేనా అన్నట్టు ఉంటుందని జరిగిన ప్రచారం వట్టిదేనని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలతో తేలిపోయింది. నగరంలోని 150 డివిజన్లకుగాను ఈనెల 1న 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్‌పేటలో పలు కారణాలతో వాయిదావేసి తిరిగి గురువారం పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మత విద్వేషాల బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర నేతలతోపాటు దేశం నలుమూలల నుంచీ వచ్చిన కమలం పార్టీ శ్రేణులు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. కేంద్రమంత్రులంతా ఇక్కడే తిష్టవేసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం జోరుగా సాగుతున్నవేళ లేని పనిని కల్పించుకొని సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. దాంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసారి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలపై పదికి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించాయి. అన్ని సర్వేలూ టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయమని తేల్చాయి.