గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 01:40:53

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ నీతులా!

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ నీతులా!

  • ఎమ్మెల్సీగా కవిత గెలుపు నల్లేరుపై నడుకే
  • అభివృద్ధి వల్లే టీఆర్‌ఎస్‌లోకి వలసలు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఫిరాయింపులకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్‌, బీజేపీలేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. 2007లో కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి, ఇప్పుడు ఫిరాయింపులపై నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవాచేశారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం వీడియో సందేశం ద్వారా కాంగ్రెస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 824 ఓట్లు ఉంటే టీఆర్‌ఎస్‌కు 80% ఓటర్ల బలమున్నదని, కాంగ్రెస్‌, బీజేపీలకు బలం లేకున్నా అభ్యర్థులను బరిలో నిలిపి ఎన్నికల కమిషన్‌కు పోటాపోటీ ఫిర్యాదులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఒత్తిడితోనే స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, ఇది ఆపరేషన్‌ ఆకర్ష్‌ కాదని అభివృద్ధి ఆపరేషన్‌ అని వివరించారు. 

ఎంపీ అర్వింద్‌.. పసుపు బోర్డు ఏమైంది?

నందిపేట్‌: పసుపుబోర్డు ఏమయ్యిందని ఎంపీ అర్వింద్‌ను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి ఏడాది గడిచిన సందర్భంగా ఆయన పసుపుబోర్డు అంశాన్ని గుర్తుచేశారు. ఎంపీగా గెలువగానే పసుపుబోర్డు ఏర్పాటుచేస్తానని ఎన్నికల సమయంలో రైతులకు బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.


logo