గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:49

గ్రాడ్యుయేట్‌ ఓటు చైతన్యం

గ్రాడ్యుయేట్‌ ఓటు చైతన్యం

  • ఓటర్ల నమోదుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక కార్యాచరణ
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనతో పార్టీ ప్రణాళిక 
  • భారీగా నమోదుకానున్న గ్రాడ్యుయేట్‌ ఓటర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులో ఓటర్ల నమోదు కీలకం కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ఓటర్ల నమోదు నుంచే ప్రత్యేక ప్రణాళిక, పకడ్బందీ కార్యాచరణ ద్వారా రెండు గ్రాడ్యుయేట్‌ స్థానాలను సులువుగా భారీ మెజారిటీతో కైవసంచేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశంచేశారు. వరంగల్‌- నల్లగొండ- ఖమ్మం, హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలు మార్చిలో ఖాళీ కానున్నాయి. ఇక్కడ 77 అసెంబ్లీ నియోజకవర్గాలు, 20 కొత్త జిల్లాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదును ఎన్నికల కమిషన్‌ చేపట్టింది. 

ఇందులో భాగంగా సామాజిక బాధ్యతగా టీఆర్‌ఎస్‌ అర్హులైనవారిలో అవగాహన, చైతన్యం తీసుకొచ్చి ఓటర్లుగా నమోదు చేయిస్తున్నది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేనివిధంగా 60 లక్షల సభ్యులు టీఆర్‌ఎస్‌కు ఉన్నారు. వారందరి వివరాలు పార్టీ వద్ద ఉన్నందున తద్వారా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలను విజయవంతంగా కైవసంచేసుకోవచ్చని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికోసం నియోజకవర్గాలవారీగా ఉన్న పార్టీ సభ్యుల సమగ్ర వివరాలతో కూడిన జాబితాను ఆయా ఎమ్మెల్యేలకు అందించనున్నారు. పార్టీ సభ్యులుగా ఉన్నవారిలో అర్హత ఉన్నవారు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులందరినీ ఓటర్లుగా నమోదుచేయించుకునేలా చైతన్య పర్చనున్నారు. వీరితోపాటు అర్హులైన పార్టీ సానుభూతి పరులు, అభిమానులను ఓటర్లుగా నమోదుచేయించనున్నారు. దీని కోసం ప్రతి గ్రామానికి ఒకరిని ఇంచార్జిగా నియమించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఆయా ఇంచార్జిలు అర్హులనుంచి పూర్తి సమాచారాన్ని, దరఖాస్తు ఫారాన్ని, ఇతర డాక్యుమెంట్లను తీసుకొచ్చి సంబంధించి కార్యాలయాల్లో సమర్పించనున్నారు. పట్టణాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచి, వారు కూడా దరఖాస్తుచేసుకునేలా చూడనున్నారు. ఇందుకు నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు గ్రాడ్యుయేట్‌ ఎన్నికలపై టెలికాన్ఫరెన్స్‌, ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశాలు నిర్వహించారు. శనివారంనాటి సీఎం కేసీఆర్‌ సమావేశంతో ఎమ్మెల్యేల్లో మరింత ఉత్సాహం, పట్టుదల పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించడంతో వారు మరింత అలర్ట్‌ అయ్యారు.

ఈ నెలాఖరు కల్లా పూర్తే లక్ష్యం

ఓటరు నమోదుకు వచ్చే నెల 6వ తేదీవరకు సమయం ఉన్నా, ఈ నెలాఖరు కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాలవారీగా ఎన్ని ఓట్లను నమోదుచేశారో ఎప్పటికప్పుడు తెప్పించుకోనున్నారు. రాష్ట్రంలో డిగ్రీ పూర్తిచేసినవారు లక్షల్లో ఉన్నా.. చాలాతక్కువ మంది మాత్రమే ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ చేపడుతున్న చైతన్య, అవగాహన కార్యక్రమాలు, గ్రామాలవారీగా అర్హులైనవారి జాబితా సిద్ధంచేయడం, గ్రామానికి ఒకరిని ఇంచార్జిగా నియమించడం ద్వారా ఈ సారి పెద్దఎత్తున ఓటర్ల నమోదు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో గెలుపునకు బలమైన పునాది పడేలాచేస్తున్నారు. ఓటర్లుగా దరఖాస్తుతోపాటు వారందరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని పార్టీ నాయకులకు  సీఎం దిశానిర్దేశంచేశారు. దీంతో ఓటర్లుగా నమోదైనవారిలో అత్యధికులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు ఉంటాయని, పార్టీ అభ్యర్థుల గెలుపు  సులభమవుతుందని, భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు.


logo