శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:20:47

బీసీలు, మహిళలకు పెద్దపీట

బీసీలు, మహిళలకు పెద్దపీట

  • టీఆర్‌ఎస్‌ జాబితాలో సగానికిపైగా వారే..
  • అన్‌రిజర్వుడు స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు చాన్స్‌
  • 15 మంది కొత్త వారికి టికెట్లిచ్చిన గులాబీ పార్టీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలేగానీ ఎన్నికలొచ్చే సరికి రాజకీయ పార్టీలు ముఖం చాటేస్తున్నాయి. అయితే, టీఆర్‌ఎస్‌ మాత్రం బీసీలు, మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రకటించడమే కాకుండా చేతల్లో చూపించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు రెండు దఫాలుగా విడుదల చేసిన 125 మంది అభ్యర్థుల జాబితాలో రిజర్వు చేసిన స్థానాల కంటే అదనంగా 30 చోట్ల బీసీలకు అవకాశం కల్పించింది. రిజర్వుడు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు సైతం అవకాశమివ్వడం ఒక వంతైతే.. ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో సగానికి పైగా మహిళలు, బీసీలు ఉండటం మరో విశేషం. ఇప్పటివరకు 15 సిట్టింగ్‌ స్థానాల్లో ఈసారి కొత్త ముఖాలను బరిలో నిలిపింది.

పక్కాగా అభ్యర్థుల ఎంపిక

టీఆర్‌ఎస్‌ తొలి రెండు జాబితాల్లో 125 డివిజన్లలో రిజర్వేషన్లవారీగా చూస్తే.. ఒకటి చొప్పున ఎస్టీ జనరల్‌, ఎస్టీ మహిళ, నాలుగు ఎస్సీ మహిళా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నాలుగు ఎస్సీ జనరల్‌, 23 బీసీ జనరల్‌, 22 బీసీ మహిళ, 31 మహిళా జనరల్‌, మరో 39 అన్‌ రిజర్వుడుగా ఉన్నాయి. ఇందులో 66 మంది అంటే సుమారు 53 శాతం డివిజన్లను మహిళలకు కేటాయించారు. బీసీ అభ్యర్థులు ఏకంగా 64 మంది.. సగానికిపైగా ఉండటం విశేషం. ఇప్పటివరకు 16 మంది మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎస్టీలకు రెండు స్థానాలు మాత్రమే రిజర్వు చేయగా.. టీఆర్‌ఎస్‌ ముగ్గురు ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఎస్సీలకు పది స్థానాలను రిజర్వు చేయగా... రెండు జాబితాల్లో కలిపి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అదనంగా ఒక రిజర్వుడు స్థానంలోనూ ఎస్సీకి అవకాశమిచ్చారు. 75 స్థానాలను మహిళలకు రిజర్వు చేయగా.. రెండు జాబితాల్లో 66 డివిజన్లకు మహిళా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే మహిళలకు రిజర్వు అయిన వాటి కంటే అదనంగా పదమూడు స్థానాలను ఎక్కువ ఇచ్చారు. బీసీలకు 50 స్థానాలు రిజర్వు చేయగా.. 64 మంది బీసీ అభ్యర్థులకు అంటే అదనంగా 14 స్థానాలను బీసీలకు టీఆర్‌ఎస్‌ కేటాయించింది.

బరిలో గెలుపు గుర్రాలు

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన రెండు జాబితాల్లో 67 సిట్టింగ్‌ స్థానాలు ఉన్నాయి. ఇందులో 52 డివిజన్లలో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. 15 సిట్టింగ్‌ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇందులో సోమాజిగూడ డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అత్తలూరి విజయలక్ష్మి అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు. మియాపూర్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ రమేశ్‌ అనారోగ్యంతో చనిపోవడంతో.. అక్కడ కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. రామచంద్రాపురం డివిజన్‌ కార్పొరేటర్‌ తొంటి అంజయ్యకు మాత్రం ఈసారి అవకాశం కల్పించలేదు. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని నిలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ కావ్యారెడ్డి వేరే పార్టీలోకి వెళ్లినందున ఆ స్థానంలో టీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ శాంతిశ్రీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో.. కొత్త అభ్యర్థిని బరిలో నిలిపింది. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోయినందున అక్కడ ప్రేమ్‌దాస్‌గౌడ్‌కు టికెట్‌ ఇచ్చారు. బాలానగర్‌, వివేకానందనగర్‌ కాలనీ, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్దనగర్‌, బేగంపేట డివిజన్లలోనూ సిట్టింగ్‌లను పక్కనపెట్టి గెలిచే అవకాశం ఉన్న వారిని బరిలో నిలిపారు.