e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides రాష్ట్రమంతటా గులాబీ తోట

రాష్ట్రమంతటా గులాబీ తోట

రాష్ట్రమంతటా గులాబీ తోట
  • పల్లె నుంచి పట్నందాకా ఎదురులేని టీఆర్‌ఎస్‌
  • ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. 16,000 మంది
  • పదవేదైనా జోరు కారుదే.. గెలుపు గులాబీదే
  • అన్ని జడ్పీలు, కార్పొరేషన్లలో ఎగిరిన జెండా
  • 130 మున్సిపాల్టీల్లోనూ ఆధిక్యం టీఆర్‌ఎస్‌దే
  • సహకార సంఘాల్లోనూ సహ‘కారు’దారులే
  • కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజల అచంచల విశ్వాసం

పల్లె, పట్నం అనే తేడా లేదు.. వీధి, వాడా అనే బేధం లేదు.. అసెంబ్లీ, పార్లమెంట్‌ అనే అనుమానం లేదు.. పార్టీ, పార్టీయేతర అనే పదజాలం లేదు.. ఈవీఎం, బ్యాలెట్‌ అనే సంశయం లేదు.. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం. రాష్ట్రంలో పల్లె నుంచి పట్నం దాకా గుబాళింపులే. అన్ని పీఠాలపై గులాబీ నేతలే. ఏడేండ్లుగా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షానే నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికే జై కొడుతున్నారు. తాజాగా మినీ మున్సిపల్‌పోల్స్‌లోనూ రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలూ కారు ఖాతాలోనే చేరాయి. గల్లీ నుంచి ఢిల్లీదాకా 16వేల మందితో కూడిన గులాబీ దళం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.
హైదరాబాద్‌, మే 7 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నో పార్టీలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి. టీఆర్‌ఎస్‌దీ అదే పరిస్థితి’. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన సమయంలో తెలంగాణ వ్యతిరేకుల అవహేళన ఇది. అవహేళన చేసిన ఒక్కో పార్టీని ఓడించుకుంటూ పల్లెల్లో వార్డు సభ్యుడి మొదలు.. పార్లమెంటు మెంబర్‌ దాకా.. అన్ని రకాల వేదికలపై అపూర్వమైన విజయాలు సాధించింది.

టీఆర్‌ఎస్‌ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తి అని చాటుకున్నది. చట్టసభలు, స్థానికసంస్థలు, సహకార సంస్థలకు చెందిన 16వేలకుపైగా ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలమైనశక్తిగా మారింది. పద్నాలుగేండ్లపాటు ఉద్యమ జెండామోసి సాధించిన రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నది.

రాష్ట్రమంతటా గులాబీ తోట

ఈ కృషి కూడా తోడవడంతో అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, సహకార సంఘాలు ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తున్నారు. పార్టీ గుర్తుపై పోటీచేసినా, మద్దతుదారులుగా బరిలో నిలిచినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే విజయం వరిస్తున్నది. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యూహరచన, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు కార్యాచరణతో పార్టీ విజయశిఖరాలను అధిరోహిస్తున్నది. ఏ పార్టీకైనా స్థానిక సంస్థలే పునాది. క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలంటే అక్కడ ప్రాతినిధ్యమే ప్రధానం.

పల్లె, పట్టణాలు అనే తేడాలేకుండా అన్ని స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ సంపూర్ణ విజయం సాధించింది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కకు పట్టం కట్టారు. గులాబీ జెండాను ఆదరించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ఎక్కడా విశ్వసించలేదు.

రాష్ట్రమంతటా గులాబీ తోట

మున్సిపాలిటీలన్నీ కైవసం

రాష్ట్రంలో మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉండగా.. అన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. దీంతో వందకు వంద శాతం కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగురవేసింది. కోటికిపైగా జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి మేయర్‌ స్థానాన్ని దక్కించుకున్నది. దీంతోపాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, నిజాంపేట, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, బడంగ్‌పేట, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్‌, జవహర్‌నగర్‌ కార్పొరేషన్లు గతేడాదే టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడగా.. తాజాగా వరంగల్‌, ఖమ్మం అందులో చేరాయి.

గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ..

గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ టీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. 32 జడ్పీలపై గులాబీజెండా ఎగురవేశారు. పూర్తిగా రైతులు ఓటర్లుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే సహకారం అందించారు. రాష్ట్రంలో 904 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరగ్గా వీటిలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందారు. రాష్ట్రంలోని తొమ్మిది డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్ల స్థానాలన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ నాయకులు గెలుపొందారు.

ఎదురులేని రాజకీయ శక్తి

రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ సహా 13 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు ఉన్నాయి. మందమర్రి, పాల్వంచ, మణుగూరు, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 138 పట్టణ పురపాలిక సంస్థల్లో ఎనిమిది మినహా మిగిలిన వాటన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. సీఎం కేసీఆర్‌ నాయకత్వం, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కార్యాచరణ, భవిష్యత్‌ ప్రణాళికపై నమ్మకంతోనే ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రత్యర్థులుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌లు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అపవిత్ర పొత్తుతో మణికొండ తదితర మున్సిపాలిటీల్లో గెలిచాయి.

పార్టీ నిర్ణయానికి కట్టుబడితే అవకాశాలు

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే అందరికీ అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నేను కూడా మున్సిపల్‌ కౌన్సి లర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, మంత్రినయ్యా. పార్టీని నమ్ముకొని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడం ముఖ్యం.
బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తా

వరంగల్‌ను అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలా కృషి చేస్తా. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు నగరాభివృద్ధిపై ఉన్న ఆలోచనలను అమలు చేస్తా. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మౌలిక వసుతులు కల్పించేందుకు పాటుపడుతా.
గుండు సుధారాణి, మేయర్‌

నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు

నిబద్ధతతో పనిచేసే వారికి టీఆర్‌ఎస్‌లో గుర్తింపు ఉంటుంది. అంకితభావంతో ఉండే కార్యకర్తలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కంటికిరెప్పలా కాపాడుకుంటారు. ఖమ్మం విజయం రాష్ట్రస్థాయిలో గుర్తింపుపొందింది. నగర ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీపై పూర్తి విశ్వాసం ఉంచారు.
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఖమ్మం సమగ్రాభివృద్ధికి కృషి

ఖమ్మాన్ని మరింత సుందరీకరిస్తాం. మంత్రి పువ్వాడ అడుగుజాడల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ఖమ్మం అత్యంత వేగంగా, అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది.
-పునుకొల్లు నీరజ, మేయర్‌

ప్రజలను బిడ్డల్లా భావించాలి

కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలకు తల్లిదండ్రుల్లాంటి వారు. ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చడంలో ముందుండాలి. ప్రజలు, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసకుంటూ ప్రజల సేవలో నిమగ్నం కావాలి.
-మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సహకారంతో సిద్దిపేటను మరింత అభివృద్ధి చేస్తా. మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం, మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా గెలుపునకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు.
-మంజుల రాజనర్సు, సిద్దిపేట చైర్‌పర్సన్‌

సీఎం కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం

మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయాలు.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలకు ప్రజలు బుద్ధి చెప్పారు.
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హామీలన్నీ నెరవేరుస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కొత్తూరుకు కొత్తరూపు తీసుకువస్తాను. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను. విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు .
-లావణ్య, కొత్తూరు చైర్‌పర్సన్‌

టీఆర్‌ఎస్‌పై నమ్మకంతోనే గెలిపించారు

నకిరేకల్‌ పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమనే నమ్మకంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పట్టం కట్టారు. అందుకు అనుగుణంగా నూతన పాలకవర్గం ప్రజలకు సేవలందించాలి. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికోసం అందరూ కలిసి పనిచేయాలి.
-మంత్రి జగదీశ్‌రెడ్డి

జడ్చర్ల అభివృద్ధికి కృషి చేస్తా

జడ్చర్ల అభివృద్ధికి కృషి చేస్తా. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి సహకారంతో పట్టణాన్ని తీర్చిదిద్దుతా. ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలకవర్గ సభ్యులందరి సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తాను.
-దోరేపల్లి లక్ష్మి, చైర్‌పర్సన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్రమంతటా గులాబీ తోట

ట్రెండింగ్‌

Advertisement