గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 18:23:40

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నియమించినందుకు కేకే, సురేశ్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సంఖ్యా బలం రిత్యా... తెలంగాణకు రెండు రాజ్యసభ సీట్లు దక్కాయి. ప్రస్తుతం శాసనసభలో టీఆర్‌ఎస్‌కు ఉన్న బలాబలాలతో ఈ రెండు స్థానాలను ఆ పార్టీ సులభంగా దక్కించుకోనుంది. 

కేకే ప్రస్థానం..

కేకే రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో ప్రారంభమైంది. విద్యార్థి నాయకుడిగా, ఆ తరువాత పార్టీలో వివిధ కీలక పదవులు నిర్వహించారు. 2005లో పీసీసీ చీఫ్‌గా ఎన్నికై.. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అదే సమయంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ అధిష్టానం ఆయన సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించింది. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌లకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేకే కీలకపాత్ర పోషించారు. తెలంగాణ గళం అందుకున్నందుకు ఆయన సీడబ్ల్యూసీ, రాజ్యసభ పదవులు పొగొట్టుకోవాల్సి వచ్చింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో కేకే చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా కేకే నియమితులయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి కేకేను రాజ్యసభ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

సురేశ్ రెడ్డి ప్రస్థానం..

సురేశ్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో 27 ఏండ్ల వయస్సులోనే తొలిసారిగా బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999, 2004లోనూ గెలుపొందారు. 2004లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన స్పీకర్‌గా పని చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా పని చేసిన సురేశ్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం విదితమే. 


logo