భారతరత్న ఇవ్వరేం?

- పీవీ, ఎన్టీఆర్‌కు పూలు సరే.. పురస్కారాలేవి?
- ప్రధాని అయిన తెలంగాణ బిడ్డ పీవీ
- తెలుగుజాతి ఆత్మాభిమానం ఎన్టీఆర్
- మహనీయులను పట్టించుకోని బీజేపీ
- పార్టీలకతీతంగా మహానుభావులను గౌరవించుకొన్న తెలంగాణ సర్కార్
ఎంఐఎం నేత ఏవో పిచ్చిమాటలు మాట్లాడంగనె.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక్కసారిగా మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు. వందిమాగధులను వెంటేసుకొనిపోయి ఇద్దరి సమాధులపై నాలుగు పూలు చల్లివచ్చారు. జీవితంలో ఎన్నడూ అటువైపు తొంగిచూడని బీజేపీ నేతకు జీహెచ్ఎంసీ ఎన్నికల గడపలో ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మన ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఈ మహానుభావులిద్దరికీ భారతరత్న ఇవ్వాలని తెలుగువారంతా ఎన్నోఏండ్లుగా కోరుతున్నారు. ఇవాళ పూలుచల్లిన నేతలు తమ అధినేతలను ఒప్పించి వీరికి పురస్కారాలు ఇప్పించగలరా? పీవీ శతజయంతిని పురస్కరించుకొని ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం పంపించినా చలించని బీజేపీ నేతలకు.. ఎన్నికల్లో మాత్రం ఆయన పేరు కావాల్సివచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటినుంచి ఈ నేలను పునీతం చేసిన వారందరినీ రాజకీయాలకు అతీతంగా సముచితంగా గౌరవించుకొన్నది తెలంగాణ సర్కారు. ప్రజాగాయకుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కాళోజీ పురస్కారాన్ని అందించడమే కాకుండా ఇటీవలే ఎమ్మెల్సీ పదవినిచ్చి సత్కరించుకున్నది. మరి బీజేపీ నేతలు పూలు చల్లడమేనా? లేక తెలుగువెలుగులకు భారతరత్న ఇచ్చి గౌరవిస్తారా?
పీవీకి దక్కిన గౌరవమేది?
- ప్రధాని అయిన తెలంగాణ బిడ్డ
- ఉత్తరాది ఆధిపత్యానికి దీటుగా దక్షిణాత్యుడు
దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆయనకు భారతరత్న ఇస్తామం టూ 2014 ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానంచేశారు. ఆరేం డ్లు దాటింది. మోదీ రెండోసారి కూడా గద్దెనెక్కారు. ఆ ఊసే లేకుండా పోయింది. పీవీ శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన ఘనతను విశ్వవ్యాప్తంచేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాదిపొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన రచనలను ప్రచురిస్తున్నారు. ఆయన స్మారకాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజియం పెడుతున్నారు.
ఈ సందర్భంగానే అసెంబ్లీలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానించి.. ఆ మేరకు కేంద్రాన్ని కోరారు. బీజేపీ నేతలకు మాత్రం ఇవేవీ పట్టలేదు. ఎన్నికలు వచ్చేసరికి ఓట్లురా ల్చే బొమ్మలుగా కనిపించారు. చటాక్ పూలు తెచ్చి.. కిలో ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రం నిలువెత్తు తెలుగుదనం.. అపర తెలంగాణ మేధావి పీవీ నరసింహారావు ఘనతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా కార్యక్రమాలు చేపట్టారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. బీజేపీ, టీడీపీ రెండు పార్టీలుకూడా రాజకీయంగా పీవీ ఖ్యాతిని వాడుకొన్నాయి. ఇప్పుడు పీవీ ఘాట్ కు తానే సంరక్షకుడన్నట్టుగా గురువారం సీన్ క్రియేట్‌చేశారు. పీవీ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఒకవంతు కూడా అనుభవంలేని నాయకుడు తగుదునమ్మా అని బయలుదేరడం అందరినీ ముక్కునవేలేసుకొనేలా చేసింది.
ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడు కాదా?
- నటనలో విరాట్పురుషుడు
- తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని జగద్విఖ్యాతం చేసిన నేత
తెలుగుదనపు నిండు సౌరభం. తెలుగుభాషకు పట్టుపంచె. జాతిసిగలో తెలుగు ఆత్మగౌరవాన్ని నెలవంకగా మలచిన మహానాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ నటసార్వభౌముడే కాదు దక్షిణాది రాజనీతిని జగద్విఖ్యాతం చేసిన నాయకుడు. చలనచిత్ర రంగంలో రారాజుగా.. ముఖ్యమంత్రిగా పేద ప్రజల అన్నంగిన్నెగా మారిన ఆరాధ్యుడు. ప్రాంతీయ పార్టీలకు వేగుచుక్కగా మారి నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి న ధీశాలి. పీవీ నరసింహారావు లోక్‌సభకు పోటీచేయాల్సిన అనివార్యత నెలకొన్నప్పుడు ‘దేశ ప్రధానిగా ఇన్నాళ్లకు ఒక తెలుగుబిడ్డకు అవకాశం వస్తున్నది. ఇటువంటి తరుణంలో ఆ మహోన్నత అవకాశానికి పోటీదారుడిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదు’ అని ప్రకటించి నంద్యాల లోకసభ ఉప ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో నిలపకుండా పార్టీలకు అతీతంగా రాజనీతిని ప్రదర్శించిన దార్శనికుడు.
తన రాజకీయ పార్టీ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించి ఎంతోమందిని రాజకీయ అరంగేట్రం చేయించిన ముందుచూపున్న నేత. ఎన్టీయార్‌ని ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు. అటువంటి మహానటుడు.. మహానాయకుడిగా ఎన్టీయార్ చేసిన సేవల గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎంతోకాలంగా ప్రపంచవ్యాప్తంగా వినతులు వస్తున్నాయి. సమాధుల వద్ద పునాదులను కాపాడతామని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్న బీజేపీ నేతలకు నిజంగా ఎన్టీఆర్ మీద ప్రేమే ఉంటే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలుగు సమాజం డిమాండ్ చేస్తున్నది.
తాజావార్తలు
- మిషన్ భగీరథ పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలి
- మొదటి రోజు 175 మందికి వ్యాక్సినేషన్
- నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితకు వినతి
- గొల్ల కురుమలకు చేయూత
- డ్రోన్ వ్యవసాయం
- విత్తనాలను త్వరగా నాటాలి
- వ్యాక్సినేషన్ సజావుగా నిర్వహించాలి
- క్రీడలతో మానసిక ఉల్లాసం
- కేసుల విషయంలో నిర్లక్ష్యం వద్దు
- వ్యాక్సిన్.. సక్సెస్