గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 03:22:40

బడుగులకు పెద్దపీట

బడుగులకు పెద్దపీట
  • పురపాలికల్లో సామాజిక న్యాయం
  • అధికారం దక్కని కులాలకు పదవులతో పట్టాభిషేకం
  • జనరల్‌ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో ఎన్నడూ, ఏ పార్టీ ఇవ్వని విధంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. బడుగు, బలహీనవర్గాలకు పదవులతో పట్టాభిషేకంచేసింది. రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఎంబీసీలకు అత్యున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరచూ చెప్పే మాటను ఇప్పుడు ఆచరణాత్మకంగా చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ సఫాయి కర్మచారి, ఓ దళితుడు జనరల్‌ స్థానాల్లో చైర్‌పర్సన్లుగా ఏనాడూ ఎన్నికవలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక రాజకీయ పరిస్థితులను సమూలంగా మార్చాలన్న టీఆర్‌ఎస్‌ దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమయింది. టీఆర్‌ఎస్‌ నాయకులకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లకు సంబంధించి 240 పదవులు దక్కగా, ఇందులో బీసీలకు 58 మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు, 45 వైస్‌చైర్‌పర్సన్‌ పదవులు ఇచ్చారు. ఓసీలకు 38 చైర్‌పర్సన్‌ పదవులతోపాటు 46 వైస్‌చైర్‌పర్సన్‌ పదవులు వరించాయి. ఎస్సీ సామాజికవర్గానికి 17 చైర్‌పర్సన్‌, 9 వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు లభించాయి. 


ఎస్టీలకు ఐదు చైర్‌పర్సన్‌, మైనార్టీలకు మూడు చైర్‌పర్సన్‌, 14 వైస్‌చైర్‌పర్సన్‌ పదవులు దక్కాయి. ఇన్నాళ్లూ అధికారానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలైన ఎంబీసీలకు ఈసారి టీఆర్‌ఎస్‌ పదవులు కేటాయించింది. పరకాలలో దళిత సామాజికవర్గంలోని సఫాయి కర్మచారికి చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఎస్సీల్లోని నేతకాని, బుడగజంగాలకు పదవులు లభించాయి. వీరిలో నేతకానివారికి ఒకటి, మాలలకు 6, మాదిగలకు 16, సఫాయిలకు, బుడగజంగాలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు వరించాయి. బీసీ సామాజికవర్గంలోని కుమ్మరి, పట్కరి, పెరిక, వడ్ల, పద్మశాలి, ఎల్లాపు, రెడ్డిక, అవుసుల వంటి కులాలకు పదవులు దక్కాయి. దీంతో ఇన్నాళ్లూ రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న ఈ వర్గాలు అధికారంలో భాగస్వామ్యమయ్యాయి. గౌడ సామాజికవర్గానికి చెందినవారికి 17, ముదిరాజ్‌లకు 13, మున్నురుకాపులకు 21, పద్మశాలీలకు 13, యాదవ 18, లింగాయత్‌ 6, కురుమలకు 4, ఆర్యక్షత్రియలకు 3 పదవులు దక్కాయి. ఓసీల్లో రెడ్లకు 53, వైశ్యులకు 16, వెలమలకు 5, కమ్మలకు 2, మార్వాడీలకు 2, బ్రాహ్మణులకు 3, కాపులకు 3 పదవులు లభించాయి.


జనరల్‌ స్థానంలో బడుగులకు చాన్స్‌

సూర్యాపేట మున్సిపాలిటీలో జనరల్‌ మహిళకు చైర్‌పర్సన్‌ పదవిని రిజర్వ్‌చేస్తే ఇక్కడ దళిత మహిళ అయిన పెరుమాళ్ల అన్నపూర్ణకు టీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చిం ది. వాస్తవానికి ఇక్కడ జనరల్‌ కోటాలో రెడ్డి, వెలమ, వైశ్య తదితర కులాలవారు కూడా కౌన్సిలర్లుగా ఉన్నారు. కానీ, వారిని కాదని ఒక దళిత మహిళకు చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.మేడ్చల్‌ జిల్లాలోని పోచారం జనరల్‌ రిజర్వ్‌కు అయితే రెడ్యానాయక్‌ అనే ఎస్టీకి అవకాశం కల్పించారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ మున్సిపాలిటీ జనరల్‌కు కాగా బీసీకి చెందిన అవుసుల వ్యక్తికి కేటాయించారు. 


కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ జనరల్‌కు కాగా సద్దాంహుస్సేన్‌ అనే ముస్లింకు అవకాశం ఇచ్చారు. కామారెడ్డి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా ఆర్యక్షత్రియ (బీసీ) కులానికి చెందిన నిట్టు జాహ్నవికి అవకాశం ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ జనరల్‌కు కాగా గౌడ సామాజికవర్గానికి, దేవరకద్ర జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా లింగాయత్‌కు, నాగర్‌కర్నూల్‌ జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ కాగా గౌడకు, రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో జనరల్‌ కాగా గౌడకు, మేడ్చల్‌ జిల్లా కొంపల్లి జనరల్‌ కాగా యాదవ్‌కు, దుండిగల్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా మున్నూరుకాపు, ఘట్‌కేసర్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా యాదవ్‌కు, వికారాబాద్‌ జిల్లా తాండూరు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా మున్నూరుకాపులకు అవకాశం ఇచ్చారు. ఈ స్థానాలన్నీ బీసీలకు దక్కడం గమనార్హం.


జిల్లా కేంద్రమైన కొత్తగూడెం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా గౌడకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నందికొండ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా గౌడకు, కోదాడ జనరల్‌ మహిళకు కేటాయించగా పెరికకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా మున్నూరుకాపు, సుల్తానాబాద్‌ జనరల్‌ మహిళ కాగా గౌడ్‌కు, మంథని జనరల్‌ స్థానాన్ని మున్నూరుకాపువర్గానికి, కొత్తపల్లి జనరల్‌ మహిళ కాగా పద్మశాలికి, హుస్నాబాద్‌ జనరల్‌ మహిళ కాగా మున్నూరుకాపు వర్గానికి అవకాశం ఇచ్చారు.


టీఆర్‌ఎస్‌తో సామాజిక న్యాయం

సామాజిక న్యాయాన్ని పాటించడంలో తనకు సాటిలేదని టీఆర్‌ఎస్‌ నిరూపించుకున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ అత్యంత పకడ్బందీగా చేసిన కసరత్తుతో బడుగు బలహీనవర్గాలకు మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవుల్లో పెద్దపీట వేసి ఆయా వర్గాల పట్ల తన చిత్తశుద్ధి, నిబద్ధతను చాటుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రత్యేక పథకాలను, ప్రభుత్వ విధానాలను రూపొందించిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రెండురోజులపాటు సామాజికవర్గాలకు పెద్దపీట వేసేలా కసరత్తుచేశాం. ఈ ఎంపికల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా కొన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నది. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆయా సామాజికవర్గాలకు ఇవ్వనంత ప్రాధాన్యం టీఆర్‌ఎస్‌ ఇచ్చింది. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు స్థూలంగా ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అందులోని ఉప కులాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కింది. రిజర్వేషన్ల కంటే ఎక్కువగా ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ముఖ్యంగా జనరల్‌, జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి సామాజికవర్గాలకు, అగ్రకులాల్లోనూ పలు కులాలకు, పెద్దఎత్తున మైనార్టీలకు కూడా పార్టీ అవకాశం ఇచ్చింది.

- కే తారకరామారావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 


logo