శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 01:31:24

జీఎస్టీ బకాయిలు విడుదలచేయండి

జీఎస్టీ బకాయిలు విడుదలచేయండి

  • ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు
  • జాతీయ స్ఫూర్తితో జీఎస్టీ బిల్లుకు మద్దతు
  • లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదలచేయాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు డిమాండ్‌చేశారు. యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ పేరుతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ బిల్లుకు గతంలో మద్దతు తెలిపామని, అ చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని స్పష్టంచేశారు. జీఎస్టీ సెక్షన్‌-8 ప్రకారం 14 శాతం కంటే తక్కువగా ఆదాయం వస్తే రాష్ర్టాలకు నష్టపరిహారం ఇస్తామనిచెప్పారని, కానీ ప్రస్తుతం అమలుచేయడంలేదని నిలదీశారు. ఫెడరల్‌ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రం వ్యవహరించడంలేదని మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో సప్లమెంటరీ గ్రాంట్లపై జరిగిన చర్చలో నామా మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలో తెలంగాణ సహా పలు రాష్ర్టాల ఆదాయం గణనీయంగా తగ్గిందని, ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే రాష్ర్టానికి న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను విడుదలచేయాలని కోరారు.